కాఫీ విత్ కరణ్ తర్వాత డార్లింగ్ బిగ్గెస్ట్ షో

0

ప్రభాస్ స్వభావం గురించి తెలిసిన వారంతా అతడు చాలా సిగ్గరి అని చెబుతారు. అందుకే మీడియాకు .. టీవీ కార్యక్రమాలకు దూరం దూరంగా ఉంటారని చెబుతుంటారు. అయితే ఆ సిగ్గును పక్కన పెట్టేసి ఇదివరకూ కాఫీ విత్ కరణ్ షోకి అటెండయ్యారు డార్లింగ్ ప్రభాస్. ఈ కార్యక్రమంలోనూ సిగ్గు పడుతూనే కనిపించారు. పక్కనే బుల్లితెర కార్యక్రమాల స్పెషలిస్టు రానా ఉన్నాడు కాబట్టి సరిపోయింది కానీ.. ప్రభాస్ ఇంకా ఎక్కువగానే ఇబ్బంది పడేవాడే. ఓవైపు కరణ్ జోహార్ కొంటె ప్రశ్నలతో ప్రభాస్ ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే రానా- జక్కన్న అండతో ఎంతో సెన్సిటివ్ గా జవాబులిచ్చాడు.

ప్రభాస్ లైఫ్ లోనే తొలి బిగ్గెస్ట్ బుల్లితెర కార్యక్రమం ఇదే. ఆ తర్వాత చాలా కాలానికి ఓ తెలుగు టీవీ కార్యక్రమానికి అతిధిగా హాజరవుతుండడం ప్రస్తుతం టాలీవుడ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ప్రభాస్ హాజరవుతున్న ఆ కార్యక్రమం ఏది? అంటే ప్రదీప్ మాచిరాజు హోస్టింగ్ చేస్తున్న `కొంచెం టచ్ లో ఉంటే చెబుతా` కొత్త సీజన్ తొలి ఎపిసోడ్ కి ప్రభాస్ ఓకే చెప్పారట. జీ తెలుగులో ఇది పాపులర్ సిరీస్ అన్న సంగతి తెలిసిందే. కొంత గ్యాప్ తర్వాత కొత్త సీజన్ ని లాంచ్ చేస్తున్నారు.

ఇప్పటివరకూ ఈ కార్యక్రమానికి సంబంధించిన పనులేవీ మొదలు కాలేదు. తొలుత ప్రభాస్ ని ఒప్పించాక పనులు మొదలు పెట్టాలని జీచానెల్ యోచిస్తోందట. అలాగే ప్రభాస్ ఈ కార్యక్రమానికి అంగీకరించడానికి వేరొక లాజిక్ ఉందని చెబుతున్నారు. ప్రభాస్ నటిస్తున్న సాహో శాటిలైట్ రైట్స్ ని జీ చానెల్ దాదాపు 50 కోట్లు చెల్లించి కొనుక్కుంది. ఆ అనుబంధం ఇలా కూడా వర్కవుటవుతోందట. ప్రభాస్ ఇంటర్వ్యూతో తొలి ఎపిసోడ్ ప్రారంభిస్తే అది కార్యక్రమానికి పెద్ద బూస్ట్ ఇస్తుందని భావిస్తున్నారట. ఇండియా మోస్ట్ అవైటెడ్ `సాహో` మూవీకి సంబంధించిన ఆసక్తికర సంగతుల్ని ప్రభాస్ ఇదే వేదికపై రివీల్ చేస్తారని అభిమానులు అంచనా వేస్తున్నారు.