డైరెక్టర్ విడాకుల గోల వాళ్లకెందుకు?

0

దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు తనయుడు ప్రకాష్ కోవెలమూడి విడాకులు తీసుకున్నారంటూ బాలీవుడ్ మీడియా అనవసర రచ్చ చేస్తోంది. “ఆయనెపుడో విడాకులు తీసుకుంటే ఇప్పుడెందుకు డోలు బాజా?“.. “జడ్జిమెంటల్ హై క్యా` ప్రచారం ముఖ్యం కానీ.. ఈ వ్యక్తిగత విషయాలెందుకు?“ .. ప్రస్తుతం హైదరాబాద్ ఫిలింనగర్ లో చర్చ ఇది. అసలింతకీ ముంబై మీడియాలో ఎందుకీ ప్రచారం అన్నది చూస్తే…

2014లో ప్రకాష్ ముంబైకు చెందిన కనికా థిల్లాన్ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఆ తరువాత నుంచి ప్రకాష్ చేసిన చిత్రాలకు కనిక కథలు అందిస్తున్నారు. రకరకాల కారణాలతో టాలీవుడ్ లో ఆశించిన విజయం దక్కలేదు. తాజాగా కంగన రనౌత్- రాజ్కుమార్ రావు కలిసి నటించిన వివాదాస్పద చిత్రం `జడ్జిమెంటల్ హై క్యా` చక్కని విజయాన్ని సాధించింది. దీంతో దర్శకుడిగా ప్రకాష్ కోవెలమూడి తొలి సక్సెస్ని సొంతం చేసుకున్నారు. ఈ చిత్రానికి కనిక థిల్లాన్ కథ అందించారు. అయితే ఈ సినిమా చిత్రీకరణకు ముందే ఈ ఇద్దరూ విడిపోయారని అసలు ఈ కథతో కనికకు ఏ సంబంధం లేదని ప్రచారమవుతోంది.

`జడ్జిమెంటల్ హై క్యా` రిలీజ్ ముందు.. ప్రకాష్ కోవెలమూడి అతని భార్య కనికా థిల్లాన్ ఇద్దరూ కలిసి పని చేస్తున్నారని ప్రచారమైంది. ఈ జోడీ తొలి విజయాన్ని దక్కించుకున్నారని పొగడ్తల వర్షం మొదలైంది. ఇదిలా వుంటే వీరిద్దరూ విడిపోయారనే షాకింగ్ న్యూస్ ని ముంబై మీడియా వైరల్ గా ప్రచారం చేస్తోంది. రెండేళ్ల క్రితమే ఇద్దరూ విడిపోయారని మీడియా ఊదరగొట్టేస్తోంది. అంతేనా.. ఈ హడావుడి మొదలయ్యాక నేరుగా ప్రకాష్ కోవెలమూడి – కనిక జోడీ స్వయంగా విడాకుల వ్యవహారాన్ని ఓపెన్ అయిపోయారు. “రెండేళ్ల క్రితమే ఇద్దరం విడిపోయాం. ఎవరి దారి వాళ్లు చూసుకున్నాం“ అని తెలిపారు. అయితే ఎందుకు విడిపోయారన్న విషయాన్ని మాత్రం ప్రకాష్ చెప్పాలని చూస్తుంటే కనికా థిల్లాన్ మాత్రం ఆ విషయాన్ని బయటపెట్టడానికి ఇష్టపడటం లేదు.

ఇందులో ట్విస్ట్ ఏంటంటే ముంబై వెళ్లడానికి ప్రకాష్ కోవెల మూడి సుముఖంగా లేకపోవడమే ఇద్దరి మధ్య మనస్పర్థలకు కారణంగా మారిందని తెలుస్తోంది. ప్రకాష్ సర్కిల్ మొత్తం హైదరాబాద్ లోనే వుండటంతో ఎక్కువగా ప్రకాష్ హైదరాబాద్ లోనే వుంటున్నాడట. కనిక మాత్రం ప్రకాష్ ని వదిలేసి రెండేళ్ల క్రితమే ముంబైకు వెళ్లిపోయారట. ఇదే కారణం ఇద్దరి మధ్య దూరాన్ని పెంచిందని చెబుతున్నారు. అయినా ఇప్పటికీ స్నేహితులుగానే వుంటామని.. కలిసి సినిమాలు చేస్తామని చెబుతుండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
Please Read Disclaimer