కేజీఎఫ్ డైరెక్టర్ తో ఎన్టీఆర్ మైత్రి ఫిక్స్

0

`కేజీఎఫ్` లాంటి బ్లాక్ బస్టర్ చిత్రంతో ఇండస్ట్రీ టాప్ హీరోల దృష్టిని ఆకర్షించారు కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ఆ ఒక్క సినిమాతో అతడిలోని స్టామినా ఎంతో ప్రపంచానికి అర్థమైంది. కోలార్ బంగారు గనుల నేపథ్యంలోని హిస్టారికల్ మాఫియా స్టోరిని ఎంచుకుని అత్యంత భారీ కాన్వాసు మీద అతడు తెరకెక్కించిన విధానం క్రిటిక్స్ కే మతి చెడేలా చేసింది. కేజీఎఫ్ చూశాక మహేష్ – ప్రభాస్- ఎన్టీఆర్ – రామ్ చరణ్- అల్లు అర్జున్ లాంటి హీరోలే ప్రశాంత్ నీల్ ప్రతిభను కొనియాడారు. అతడితో కలిసి పని చేసేందుకు ఆసక్తిని కనబరిచారని వార్తలొచ్చాయి. ఇండస్ట్రీ అగ్ర బ్యానర్లన్నీ అతడి కోసం క్యూలో ఉన్నాయని ప్రచారమైంది.

ప్రభాస్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో యు.వి.క్రియేషన్స్ ఓ మూవీని ప్లాన్ చేసిందని ఇదివరకూ వార్తలొచ్చాయి. అలాగే మైత్రి మూవీ మేకర్స్ సైతం కేజీఎఫ్ డైరెక్టర్ తో ప్లాన్ చేస్తోందని లీకులు అందాయి. తాజాగా ఇదే విషయంపై మైత్రి సంస్థ అధినేతల్లో ఒకరైన నవీన్ ఎర్నేని ఫుల్ క్లారిటీనిచ్చేశారు. ఎన్టీఆర్ – కేజీఎఫ్ డైరెక్టర్ కాంబినేషన్ మూవీని అధికారికంగా కన్ ఫామ్ చేశారు.

“కేజీఎఫ్ డైరెక్టర్ తో ఎన్టీఆర్ మూవీ ప్రాసెస్ లో ఉంది. ఎన్టీఆర్ కి కేజీఎఫ్ సినిమా ఎంతో నచ్చింది. ప్రశాంత్ నీల్ పేరును ఎన్టీఆర్ స్వయంగా సూచించారు. తనవద్ద మంచి కథ ఉంటే చేద్దామని అన్నారు. ఈ ప్రాజెక్ట్ ప్రాసెస్ లో ఉంది“ అని నవీన్ తెలిపారు. “ఎన్టీఆర్ నటిస్తున్న ఆర్.ఆర్.ఆర్ పూర్తవ్వాలి. అలాగే ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ సీక్వెల్ పూర్తి చేయాల్సి ఉంటుంది. అందుకు ఇంకా చాలా సమయం పడుతుంది. ఆ తర్వాత ప్రణాళికలో వేగం పెంచుతా“మని ఆయన వెల్లడించారు. విజయ్ దేవరకొండ హీరోగా మైత్రి సంస్థ నిర్మించిన `డియర్ కామ్రేడ్` ఈనెల 26న రిలీజవుతున్న సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో నవీన్ ఎర్నేని పై సంగతుల్ని ముచ్చటించారు. ఎన్టీఆర్ తో కేజీఎఫ్ డైరెక్టర్ మూవీ అంటే దానికి జాతీయ స్థాయిలో మైలేజ్ ఉంటుదనడంలో సందేహం లేదు. బహుశా తారక్ కి అదే బెస్ట్ బాలీవుడ్ డెబ్యూ అవుతుందేమో?
Please Read Disclaimer