ప్రీ రిలీజ్ హంగులు ఎవరి కోసం ?

0

కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీస్తున్నాం. నటీనటులు టెక్నీషియన్లు అందరికి మాట తప్పకుండా పైసా తగ్గకుండా రెమ్యునరేషన్లు చెల్లిస్తున్నాం. ప్రమోషన్ అవసరం కాబట్టి మీడియా ఛానల్స్ కు ఆన్ లైన్ బ్రాడ్ క్యాస్టర్స్ కు ఎంత మేరకు అవసరమో అంతవరకు ట్రైలర్లు పాటలు పోస్టర్లు ప్రమోట్ చేసుకోవడానికి డబ్బులు ఖర్చు పెడుతున్నాం. ఇంతా చేసి మళ్ళీ ఈవెంట్ల పేరుతో లక్షలు కోట్లు ఎందుకు అదనంగా బడ్జెట్ కేటాయించాలి. ఫంక్షన్ హాళ్లనో లేదా గ్రౌండ్ లనో అద్దెకు తీసుకుని ఈవెంట్ కంపెనీలకు కాంట్రాక్టులు ఇచ్చి ఇంత వ్యయాన్ని ఎందుకు భరించాలి. ఇది ప్రతి నిర్మాత వేసుకుంటున్న ప్రశ్న.

అన్నింటికీ సిద్ధపడి గ్రాండ్ గా ఈవెంట్లు చేస్తే ఓపెనింగ్ రోజు ఇవేవి టికెట్లు తెగేందుకు ఉపయోగపడటం లేదు. టీవీ లైవ్ వచ్చిన ఆ కాసేపు తప్ప జనం వీటిని పూర్తిగా మర్చిపోతున్నారు. అది కూడా స్పెషల్ గెస్టులు వస్తేనే చూస్తారు తప్ప అదే సినిమా యూనిట్ వస్తే అంతగా చూసేందుకు ఇష్టపడరు. ఒకవేళ లైవ్ మిస్ అయితే యుట్యూబ్ లో చూసేందుకు సైతం పెద్దగా ఆసక్తి చూపడం లేదు. అలాంటప్పుడు ఇవి ఎవరికి లాభం అనే ప్రశ్న ప్రతి నిర్మాతను వేధిస్తోంది.

ఒకప్పుడు ఇలాంటి హంగామా ప్రీ రిలీజ్ ఈవెంట్లు ఉండేవి కాదు. మొదటిరోజు రెండుషోలు కాగానే సాయంత్రం సక్సెస్ మీట్లు పెట్టేవాళ్ళు కాదు. దేనికైనా ఒక టైం పద్దతి ఉండేది. ఇప్పుడేంటి అంటే పులిని చూసి నక్క వాత పెట్టుకున్న తరహాలో వాళ్లెవరో చేశారు కాబట్టి నేను చేయకపోతే చులకన అవుతామేమో వెనుక బడతామేమో అన్న ఫీలింగ్ లో ఈవెంట్ కంపెనీల మీద గుడ్డిగా ఆధారపడుతూ వాళ్ళు అడిగినంత సమర్పించుకుంటున్న నిర్మాతలు కోకొల్లలుగా ఉన్నారు.

ఇది ఇప్పుడు ఏ స్థాయికి చేరిందంటే చిన్న చిన్న టీవీ షోలు ఆర్గనైజ్ చేసే ఓ ఈవెంట్ మానేజ్మెంట్ సంస్థ ఇప్పుడు ఏకంగా భారీ సినిమాలను నిర్మించే రేంజ్ కు వచ్చేసింది. దీనికి కారణం అవసరం ఉన్నా లేకపోయినా ప్రీ రిలీజ్ ఈవెంట్ల పేరుతో నిలువు దోపిడీకి సిద్ధపడిన నిర్మాతలే. కంటెంట్ ఉన్న సినిమాకు ఎలాంటి హంగులు అవసరం లేదనే సత్యం చరిత్ర రుజువు చేస్తున్నా ఈ ధోరణిలో మాత్రం మార్పు రావడం లేదు.

ఇటీవలే ఓ సినిమాకు ఐదు రాష్ట్రాల్లో భారీ ఎత్తున ఆరు ప్రీ రిలీజ్ ఈవెంట్లు మ్యూజికల్ నైట్లు చేస్తే ఇప్పుడది బాక్స్ ఆఫీస్ వద్ద కనీసం పెట్టుబడి తెచ్చేందుకే ఆపసోపాలు పడుతోంది. ఈ హంగామా కోసమే నిర్మాతలు సుమారు 2 కోట్లకు పైగా ఖర్చు చేశారట. ఇప్పటికైనా ప్రీ రిలీజ్ ఈవెంట్ల మత్తుని వదిలి దీని వల్ల ఎవరికి ప్రయోజనం కలుగుతోందో గుర్తించి నిర్మాతలు జాగ్రత్త పడితే ఇలాంటి భారాలు నెత్తి మీద పడకుండా కాపాడుకునే వారు అవుతారు.
Please Read Disclaimer