నెక్స్ట్ వెబ్ సిరీస్ అంటున్న ప్రియాంక

0టాలీవుడ్ బ్యూటీలు బాలీవుడ్ లో జెండా ఎగరెయ్యాలని ఎప్పుడూ తపిస్తూ ఉంటారు. అదే కొంతమంది బాలీవుడ్ బ్యూటీలు హాలీవుడ్ లో జెండా ఎగరేస్తున్నారు. అలా ఇప్పటికే తమ జెండా ఎగరేసి గ్లోబల్ బ్యూటీలుగా పేరుతెచ్చుకున్న వారిలో ప్రియాంక చోప్రా పేరు తప్పనిసరిగా చెప్పుకోవాలి. ఇప్పటికే రెండు హాలీవుడ్ సినిమాలలో నటించిన పీసీ ఇప్పుడు ‘ఈజింట్ ఇట్ రొమాంటిక్’ అనే హాలీవుడ్ రొమాంటిక్ ఫిలింలో నటిస్తోంది. తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎంటా అనే చర్చలు జరుగుతున్న సమయంలో ఇప్పుడు ఓ కొత్త అప్డేట్ బయటకు వచ్చింది.

ప్రియాంక తన తర్వాతి ప్రాజెక్ట్ మరో హాలీవుడ్ సినిమా అని మీరనుకుంటే .. ఇంటి దగ్గర ఉండే కర్రీ సెంటర్ లో కొనుక్కుని వచ్చిన పప్పులో కాలేసినట్టే. ఆమె ఈసారి ఒక హై బడ్జెట్ వెబ్ సిరీస్ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. అమెరికాలో ఉన్న ఒక టాప్ నిర్మాణ సంస్థ ఈ వెబ్ సీరీస్ ను ప్రొడ్యూస్ చేస్తుందని సమాచారం. ప్రపంచంలో లీడింగ్ లో ఉన్న డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ అయిన నెట్ ఫ్లిక్స్ కోసం వారు ఈ వెబ్ సీరిస్ నిర్మిస్తున్నారు. త్వరలో ఈ వెబ్ సీరీస్ కి సంబంధించిన ఇతర వివరాలు వెల్లడవుతాయి.

ఇప్పటికే ప్రియాంక ‘క్వాంటికో’ అనే హాలీవుడ్ టీవీ సీరీస్ లో నటించి మంచి రికగ్నిషన్ సాధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి కుడా అడుగుపెడుతోంది కాబట్టి మరో ప్రియాంక దాదాపు అన్నీ ప్లాట్ ఫామ్స్ కవర్ చేసినట్టే. మరో వైపు బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ నటించిన ‘స్కేర్డ్ గేమ్స్’ అనే వెబ్ సీరిస్ కు ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. ప్రియాంక ఇంకా పెద్ద గ్లోబల్ స్టార్ కాబట్టి తప్పకుండా తన వెబ్ సీరీస్ కూడా సక్సెస్ అవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.