రానాకు 1945 నిర్మాత ఘాటైన కౌంటర్

0

రానా కథానాయకుడిగా చారిత్రక కథాంశంతో 1945 చిత్రం 2017లో ప్రారంభమైన సంగతి తెలిసిందే. కొంత షూటింగ్ తర్వాత ఆ సినిమాని మధ్యలోనే ఆపేశారు. పారితోషికం విషయమై నిర్మాతతో రానాకు సెట్ కాలేదని అప్పట్లో ప్రచారమైంది. ఆ తర్వాత ఆ సినిమాకి సంబంధించిన సమాచారమే లేదు. తాజాగా దీపావళి సందర్భంగా చిత్ర నిర్మాత రాజరాజన్ ఈ సినిమా పోస్టర్ ని విడుదల చేయడమే గాక.. రిలీజ్ తేదీని ప్రకటించారు. ఈ పోస్టర్ కి రానా స్పందించి “డబ్బు రాబట్టుకోవడం కోసమే పూర్తి కాని సినిమాని రిలీజ్ చేస్తున్నారు. మార్కెట్ ని మోసం చేస్తున్నారు. ఎవరూ నమ్మొద్దు“ అని సామాజిక మాధ్యమాల్లో వ్యాఖ్యానించారు రానా. “ఏడాది దాటింది ఈ నిర్మాతలను కలిసి. పారితోషికాలే తేలలేదు!“ అని తెలిపారు. అయితే ఆ వివాదాస్పద ట్వీట్ ని రానా వెంటనే ట్విట్టర్ నుంచి తొలగించారు.

అయితే రానా ట్వీట్ కి ఘాటుగా స్పందించారు నిర్మాత రాజరాజన్. కాస్త కటువుగానే సమాధానం ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది. “సినిమా పూర్తయ్యిందా.. లేదా? అనేది డైరెక్టర్ మాత్రమే నిర్ణయిస్తాడు. 60 రోజుల పాటు షూటింగ్ చేసి కోట్లాది రూపాయలు పోసాం. పూర్తి కాకుండానే సినిమాని ఎవరూ రిలీజ్ చేయరు“ అంటూ రిప్లయ్ ఇవ్వడంతో అది కాస్తా టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.

రానా హీరోగా కె.ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న 1945 చిత్రానికి సత్య శివ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రీఇండిపెండెన్స్ నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రమిది. సుభాష్ చంద్రబోష్ అజాద్ హింద్ ఫౌజ్ ఆర్మీలో వీరసైనికుడిగా రానా నటిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాత – హీరో మధ్య ఘర్షణ నేపథ్యంలో సినిమా రిలీజవుతుందా లేదా? అన్నది సస్పెన్స్ గా మారింది.
Please Read Disclaimer