సంక్రాంతి పుంజుల మెడపై నిర్మాతల గిల్డ్ కత్తి!

0

గత కొంతకాలంగా సంక్రాంతి బరిలో దిగుతున్న ఓ రెండు భారీ చిత్రాల గురించి ఆసక్తికర చర్చ సాగుతోంది. మహేష్ కథానాయకుడిగా నటిస్తున్న సరిలేరు నీకెవ్వరు.. బన్ని కథానాయకుడిగా నటిస్తున్న అల వైకుంఠపురములో రిలీజ్ తేదీల మధ్య క్లాష్ గురించే ఆసక్తికర చర్చ సాగుతోంది. ఇటు అభిమానుల్లో అటు ఇండస్ట్రీ వర్గాల్లో వేడెక్కించిన టాపిక్ ఇది. ఇద్దరు స్టార్ హీరోలు సంక్రాంతి పుంజుల్లా ఒకరిపై ఒకరు కత్తి కడుతూ ఒకేరోజు రిలీజ్ కి వస్తుండడంతో ఏదో తేడా కొడుతోంది! అంటూ మాట్లాడుకున్నారు.

రెండు భారీ చిత్రాలు ఒకేరోజు రిలీజవుతుంటే ఆ మేరకు బాక్సాఫీస్ పోరులో చిక్కులొస్తాయన్న విశ్లేషణ సాగింది. ఇక అభిమానుల మధ్య అయితే నువ్వా నేనా? అన్న హోరా హోరీ ఇప్పటికే సోషల్ మీడియాలో హీటెక్కించింది. ఆ క్రమంలోనే ఆ ఇద్దరు హీరోల సినిమాలు పోటీపడకుండా కొద్దిగా ఎడం జరగడానికి ఆస్కారం ఉందన్న కొత్త స్వరం వినిపించింది. కానీ దీనిపై ఇరువైపులా నిర్మాతలు ఇంతవరకూ స్పందించలేదు. దీంతో ఆ ఇద్దరూ ముందే ప్రకటించిన తేదీకే కట్టుబడి జనవరి 12న ఒకరితో ఒకరు పోటీపడుతున్నారని అభిమానులు భావించారు.

ఎట్టకేలకు ఈ సమస్యను పరిష్కరించేందుకు యాక్టివ్ తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ గిల్డ్ (ఏటీఎఫ్ పీజీ) కలగజేసుకుంది. సరిలేరు నీకెవ్వరు నిర్మాత అనీల్ సుంకర.. అల వైకుంఠపురములో నిర్మాత చినబాబు ఇరువురిని పిలిపించి ఈ సమస్యకు పరిష్కారం వెతికామని తాజాగా నిర్మాతల గిల్డ్ అధికారికంగా ప్రకటించింది. సరిలేరు చిత్రాన్ని జనవరి 11న రిలీజ్ చేసేందుకు అనీల్ సుంకర అంగీకరించారని.. అల వైకుంఠపురములో యథాతథంగా రిలీజవుతుందని గిల్డ్ ప్రతినిధులు ప్రకటించారు. మొత్తానికి ఇద్దరు హీరోల మధ్య రిలీజ్ తేదీ సమస్య లేకుండా పరిష్కరించగలిగినందుకు చాలా సంతోషంగా ఉందని నిర్మాతల గిల్డ్ ప్రకటించింది.

ఇంతకుముందు నానీ-వరుణ్ తేజ్ మధ్య క్లాష్ వచ్చినప్పుడు.. గ్యాంగ్ లీడర్- గద్దల కొండ గణేష్ సినిమాల మధ్య రిలీజ్ తేదీల్ని మాట్లాడి పరిష్కరించగలిగామని నిర్మాతల గిల్డ్ ఈ సందర్భంగా గుర్తు చేసింది. సంక్రాంతి పందెంలో పెద్ద హీరోల్ని ఒప్పించడం ఆనందంగా ఉందని ప్రకటించారు. మునుముందు ఇకపై ఇలాంటి సమస్యల్ని పరిష్కరించేందుకు గిల్డ్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని అధికారిక ప్రెస్ నోట్ లో ప్రకటించడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. తమ సంఘం ప్రతిపాదనకు ఇన్వాల్వ్ మెంట్ కి సహకరించిన నిర్మాతలకు కృతజ్ఞతలు తెలియజేసింది గిల్డ్.
Please Read Disclaimer