ఇస్మార్ట్ శంకర్ ను ఆంధ్రాలో చూస్తారా అన్నాడట!

0

రామ్ హీరోగా పూరి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రం ఈనెల 18న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ చిత్రం ప్రివ్యూను తాజాగా చిత్ర యూనిట్ సభ్యులు చూడటం జరిగింది. ప్రివ్యూ తర్వాత దర్శకుడు పూరి జగన్నాధ్ మీడియాతో మాట్లాడుతూ సినిమా పూర్తి అయ్యింది ఇక సెన్సార్ ఆఫీసర్ చూసి స్టాంప్ వేస్తే విడుదలకు రెడీ అంటూ ప్రకటించాడు. ఈ చిత్రంపై అంచనాలు భారీగా పెరిగేలా దర్శకుడు పూరి వ్యాఖ్యలు చేశాడు.

పూరి మాట్లాడుతూ రామ్ లో చాలా మ్యాటర్ ఉంది వాడుకున్నోడికి వాడుకున్నంత. నాకు చేతనైనంత వరకు వాడేసుకున్నాను. అతడిలో ఇంకా బోలెడు ట్యాలెంట్ ఉంది. ఈ సినిమాలోని రామ్ పాత్రలో యాక్టింగ్ మామూలుగా లేదు. సినిమా చూసి బయటకు వెళ్లిన తర్వాత కూడా శంకర్ పాత్ర మీ మైండ్ లో తిరుగుతూనే ఉంటాడు. గతంలో టెంపర్ సినిమా చూసిన తర్వాత తారక్ పాత్రను ఎప్పుడు మర్చిపోలేరని చెప్పాను. ఇప్పుడు ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత కూడా అలాగే నిలిచి పోతాడని పూరి చెప్పుకొచ్చాడు.

ఈ చిత్రంలో రామ్ మాట్లాడే తెలంగాణ యాస డైలాగ్స్ సినిమాకు హైలైట్ గా నిలుస్తాయి. ఇటీవల వైజాగ్ బయ్యర్ నన్ను సర్ సినిమాలో రామ్ మార్ ముంతా చోడ్ చింతా అంటూ డైలాగ్ చెప్పాడు. ఆంధ్రాలో ఈ డైలాగ్ అర్థమే కాదు. ఇంకా చాలా డైలాగ్స్ వారికి అర్థం కావేమో అనిపిస్తుంది అన్నాడు. ఆయన మాటలు నాకు ఆశ్చర్యం అనిపించాయి. ఇన్నాళ్లు తెలంగాణలో ఆంధ్రా యాసతో సినిమాలు చూడలేదా తెలంగాణ యాస అయితే ఆంధ్రాలో చూడక పోవడం ఏంటీ అన్నాను. అదే వైజాగ్ లో హిందీ.. ఇంగ్లీష్ సినిమాలు బాగానే ఆడుతాయి. అక్కడ భాష రాకున్నా ఆ సినిమాలు చూస్తారు. అలాంటిది తెలుగు సినిమా చూడక పోవడం ఏంటీ. సినిమా బాగుంటే భాషతో సంబంధం లేకుండా సినిమాను చూస్తారు. ఆ బయ్యర్ నాకు డబ్బులు తక్కువ ఇవ్వాలనే ఉద్దేశ్యంతో అలా మాట్లాడి ఉండవచ్చు అనుకున్నాను అంటూ పూరి చెప్పుకొచ్చాడు.

ఈ చిత్రంలో రామ్ కు జోడీగా నిధి అగర్వాల్ మరియు నభా నటేష్ లు నటించారు. పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్ మరియు పూరి కనెక్ట్స్ పతాకంపై శ్రీమతి లావణ్య సమర్పణలో పూరి జగన్నాధ్ మరియు ఛార్మిలు నిర్మించారు. ఈ చిత్రంలో రామ్ డబుల్ దిమాక్ హైదరాబాదీగా కనిపించబోతున్నాడు. గతంలో ఎప్పుడూ చూడని రామ్ ను శంకర్ పాత్రలో చూస్తారంటూ సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.
Please Read Disclaimer