పోలీసుల ఎదుట విచారణకు హాజరైన పీవీపీ…!

0

ప్రముఖ నిర్మాత పీవీపీ (ప్రసాద్ వీ పొట్లూరి) తన సినిమాలతోనే కాకుండా వివాదాలతో కూడా వార్తల్లో ఉంటూ ఉంటారు. బిజినెస్ మ్యాన్ గా ప్రొడ్యూసర్ గా అందరికి సుపరిచితమైన పీవీపీ 2019 సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయితే రాజకీయాలపై సమకాలీన అంశాలపై తనదైన శైలిలో స్పందిస్తుంటారు. ఈయన తాజాగా హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీసుల ముందు విచారణకు హాజరై మరోసారి వార్తల్లో నిలిచారు.

కాగా పీవీపీ దగ్గర మేనేజర్ గా పని చేసిన తిమ్మారెడ్డి అనే వ్యక్తిని గత సెప్టెంబర్ 16న పీవీపీ కిడ్నాప్ చేశారంటూ ఆయన భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసులో పీవీపీని ఏ1 నిందితుడిగా పోలీసులు పేర్కొన్నారు. అయితే దీనికి పీవీపీ ముందస్తు బెయిల్ తీసుకున్నారు. ఇప్పుడు బెయిల్ గడువు ముగియడంతో పోలీసుల ఎదుట హాజరు కావాల్సి వచ్చింది. దీంతో పాటు బంజారాహిల్స్ లో ఓ విల్లాకు సంబంధించిన గొడవలో ఆ విల్లా యజమాని పీవీపీపై ఫిర్యాదు చేశాడు. అయితే ఈ వివాదం కేసులో పొట్లూరి వరప్రసాద్ విచారణకు హాజరు కాలేదు.

దీంతో ఈ కేసుకు సంబంధించి ప్రశ్నించడానికి పోలీసులు ఆయన ఇంటికి వెళ్ళగా.. పీవీపీ కుటుంబ సభ్యులు కుక్కలను వదిలారనే ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఈ విషయాన్ని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ చాలా సీరియస్ గా తీసుకున్నారని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ ను విడిచి విజయవాడ వెళ్లిన పీవీపీకి తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇప్పుడు ఈ రెండు కేసుల విచారణకు రావాలని పోలీసులు ఆదేశించడంతో.. పీవీపీ తన కుటుంబ సభ్యులతో కలిసి విజయవాడ నుంచి వచ్చి జూబ్లిహిల్స్ పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు.