ఎప్పుడో రిలీజ్ కావాల్సినది.. అయినా కానీ!

0

వారసుడిని హీరోని చేయడం అంటే ఆషామాషీనా? ఏ తండ్రిలో అయినా ఆ టెన్షన్ ఎలా ఉంటుందో ఊహించగలిగేదే. పైగా నటవారసత్వం లేకుండా ఫ్యామిలీ నుంచి హీరోని తయారు చేయాలంటే అది ఇంకా పెద్ద టెన్సన్ కి సంబంధించిన వ్యవహారం. ప్రస్తుతం అలాంటి సన్నివేశంలోనే ఉన్నారు రాజ్ కందుకూరి. పెళ్లి చూపులు లాంటి క్లాసిక్ హిట్ ని తెరకెక్కించిన నిర్మాతగా ఆయనకు పరిశ్రమలో కొంత గుర్తింపు ఉంది. అందుకే ఇప్పుడు కందుకూరి తనయుడు శివ కందుకూరిని హీరోగా పరిచయం చేస్తుండడంతో ఆసక్తి నెలకొంది.

శివ కందుకూరి డెబ్యూ సినిమా `చూసి చూడగానే` జనవరి 31న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. తొలి ప్రయత్నం లవ్ స్టోరీతోనే తనయుడిని లాంచ్ చేస్తున్నాడు. కందుకూరి నిర్మించిన పెళ్లి చూపులు- మెంటల్ మదిలో సక్సెస్ అయిన నేపథ్యంలో ఆ జానర్ నే నమ్ముకుని ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. అయితే ఈ సినిమాని రిలీజ్ కి చాలానే వెయిట్ చేయాల్సి వచ్చింది. చిత్రీకరణ పూర్తయి చాలా కాలమే అయ్యింది. గత ఏడాదే రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ రిలీజ్ రకరకాల కారణాలతో బాగా డిలే అయింది. మరి ఈ ఆలస్యం దేనికి? తనయుడి విషయంలో అతి కేరింగ్ ఆలస్యానికి కారణమా? అన్న సందేహాలు ఉన్న నేపథ్యంలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

సినిమా షూటింగ్ ప్రారంభం దగ్గర నుంచి ఎడిటింగ్ టేబుల్ వరకూ చాలా కరెక్షన్స్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. దర్శకుడు కూడా కొత్త కుర్రాడు కావడంతో మేకింగ్ పరంగా ఇబ్బందులు తలెత్తాయట. అలాగే స్క్రిప్ట్ పరంగాను రాజ్ కందుకూరి టేస్ట్ ని మిక్స్ చేయడంలో కొంత జాప్యం జరిగినట్లు మాట్లాడుకుంటున్నారు. రిలీజ్ కు సర్వం సిద్దమైన తర్వాత సోలో రిలీజ్ కు సరైన తేదీ కుదరకపోవడం ఆలస్యానికి మరో కారణంగా కనిపిస్తోంది. ఈ సినిమా రిలీజ్ అనుకుంటున్న సమయంలో పెద్ద సినిమాల రిలీజ్ వల్లనా ఆలస్యమైందని అంటున్నారు. ఇక అన్నీ కుదిరి శుక్రవారం సోలోగా రిలీజ్ అవుతుందనుకుంటే యూనిట్ లో కొత్త టెన్షన్ మొదలైంది.

సినిమాని రివ్యూ చేసి చెప్పేవాళ్లు రేపు అసలు థియేటర్ కి వెళ్లి సినిమా చూస్తారా? లేదా? అన్నది మరో డౌట్. సినిమాని రివ్యూ చేయకపోతే మొదటికే ప్రమాదం. ఇప్పుడు ఏ సినిమాకైనా రివ్యూ కీలకం. రివ్యూ.. మౌత్ టాక్ ని బట్టి థియేటర్ కి వెళ్లాలా వద్దా అన్నది ఆడియన్స్ డిసైడ్ అవుతారు. ప్రస్తుతం యూనిట్ అంతా ఈ టెన్షన్ లోనే ఉందిట. అయితే వారసుడికి ఎలాగైనా హిట్టు ఇచ్చి తండ్రిగా మాట నిలబెట్టుకోవాలని రాజ్ కందుకూరి తెగ తపిస్తున్నాడుట. ఆ తపనకి ఇంకొన్ని గంటల్లోనే తెరపడనుంది.
Please Read Disclaimer