సెంటిమెంట్ ను నమ్ముకున్న యంగ్ హీరో

0

ఉయ్యాల జంపాల చిత్రంతో హీరోగా పరిచయం అయిన రాజ్ తరుణ్ ఆ తర్వాత వరుసగా కొన్ని సినిమాలతో సక్సెస్ లు దక్కించుకుని జూనియర్ మాస్ మహారాజా అంటూ పేరు దక్కించుకున్నాడు. కాని అంతలోనే రాజ్ తరుణ్ వరుసగా ఫ్లాప్ లను చవి చూశాడు. దాంతో ఆయనకు ఆఫర్లు రావడమే గగనం అయ్యింది. అలాంటి సమయంలో దిల్ రాజు బ్యానర్ లో సినిమా చేసే ఛాన్స్ దక్కించుకున్నాడు. ఇద్దరి లోకం ఒక్కటే చిత్రంతో ఈనెల 25న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రాజ్ తరుణ్ రెడీగా ఉన్నాడు.

టర్కీ సినిమా ఇన్సిపిరేషన్ గా తీసుకుని ఈ సినిమాను రూపొందించినట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు ఇప్పటికే ప్రకటించారు. ఇక ఈ సినిమాలో విభిన్నమైన ప్రేమ కథ ఉంటుందని అంచనాలు పెంచే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సినిమా సక్సెస్ ఖాయం అంటూ రాజ్ తరుణ్ ఒక సెంటిమెంట్ విషయాన్ని కూడా చెబుతున్నాడు. తన మొదటి సినిమా విడుదల అయిన తేదీనే ఈ సినిమా విడుదల కాబోతున్నందున ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని రాజ్ తరుణ్ ఆశ పడుతున్నాడు.

ఉయ్యాల జంపాల సినిమా 2013 డిసెంబర్ 25న విడుదలైన విషయం తెల్సిందే. ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు అదే తేదీలో విడుదల కాబోతున్న ఇద్దరి లోకం సినిమా కూడా సక్సెస్ దక్కించుకుంటుందని యూనిట్ సభ్యులు భావిస్తున్నారు. కంటెంట్ సరిగా ఉంటే ఏ తేదీన విడుదల చేసినా సక్సెస్ అవుతుంది. కంటెంట్ వీక్ గా ఉంటే సినిమా ఎంత మంచి రోజున.. సెంటిమెంట్ రోజున విడుదల చేసినా కూడా ప్రయోజనం ఉండదని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.