ప్లాస్మా దానంపై జక్కన్న ప్రచారం శహభాష్

0

కష్టకాలంలో సెలబ్రిటీలు ఎంతో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ అందరిలో స్ఫూర్తి నింపుతున్న సంగతి తెలిసిందే. ప్రజలకు ఉపయుక్తంగా ప్రభుత్వాలు చేపట్టే పలు కార్యక్రమాలకు బ్రాండ్ అంబాసిడర్ లు గా పని చేస్తున్నారు. మంచికి నేను సైతం అంటూ ప్రచారానికి సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా కొవిడ్ మహమ్మారీని ఎదిరించేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతున్న వేళ సెలబ్రిటీలు చేసిన సాయం మరువలేనిది. ప్రపంచ విలయాన్ని అర్థం చేసుకుని టాలీవుడ్ ప్రముఖులు ఎంతో స్ఫూర్తిమంతమైన ప్రచారసాయం చేశారు.

ఇక తెలంగాణ ప్రభుత్వం రక్త ప్లాస్మా ప్రయోగం గురించి తెలిసిందే. కొవిడ్ సోకిన వ్యక్తుల ప్లాస్మాను సేకరించి సీరియస్ గా ఉన్న రోగులపై ప్రయోగాస్తే అది సత్ఫలితాల్ని ఇచ్చింది. నాటి నుంచి ప్లాస్మా డోనర్స్ కోసం ప్రభుత్వాలు అర్థిస్తున్నాయి. అప్పటికే చికిత్స పొందిన కొవిడ్ రోగులు ప్లాస్మా దానానికి ముందుకు రావాల్సిందిగా విజ్ఞప్తిని చేస్తున్నాయి. దీనికి పలువురు సెలబ్రిటీలు ప్రచారం చేస్తూ స్ఫూర్తి నింపుతున్నారు. ఇటీవల యువహీరో శ్రీవిష్ణు ప్లాస్మా దానంపై క్యాంపెయిన్ స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే.

తాజాగా ఆర్.ఆర్.ఆర్ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి ముందుకొచ్చారు. కొవిడ్ -19 తో పోరాడి వైరస్ భయం నుంచి విజయవంతంగా బయటపడిన వ్యక్తులు దానం చేసిన రక్త ప్లాస్మా వైరస్ సోకిన ఇతర రోగుల చికిత్సలో గేమ్ ఛేంజర్ గా ఉందని `ప్లాస్మా దానం చేయాల`ని ప్రాణాలతో బయటపడిన వారందరికీ సామాజిక మాధ్యమాల ద్వారా విజ్ఞప్తి చేశారు. కొవిడ్ 19 ఎవరికైనా రావొచ్చు. దానికి సిగ్గు పడాల్సినదేమీ లేదు. దయచేసి ప్రాణాలను కాపాడకుండా సామాజిక కళంకం తేవొద్దు. ప్లాస్మా దానం ఆపొద్దు.. మిమ్మల్ని మీరు నిరోధించవద్దు“ అని రాజమౌళి ట్వీట్ చేశారు. http://givered.in లో ప్లాస్మా దాతలు తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు.