ఫ్యామిలీ హీరో పరిచయం.. అందుకే ఈ శ్రద్ధ!

0

దర్శకధీరుడు రాజమౌళి నిరంతర షూటింగ్ తో క్షణం తీరిక లేకుండా ఉన్న సంగతి తెలిసిందే. ఆన్ సెట్స్ ఓ ఇంటిని నిర్మించుకుని రేయింబవళ్లు ఆర్.ఆర్.ఆర్ కోసం శ్రమిస్తున్నాడు. పాన్ ఇండియా కేటగిరిలో రిలీజ్ అవుతోన్న చిత్రం కావడంతో ఎక్కడా చిన్నపాటి తప్పిదాలు అయినా లేకుండా జాగ్రత్త పడుతున్నాడు. అవసరమైన చోట రీ షూట్లు చేస్తున్నాడట. అయితే ఇంత బిజీలోనూ ఓ చిన్న సినిమాకి వారంతం అయ్యే సరికి సమయాన్ని కేటాయిస్తున్నాడు. ఆ మూవీ మేకింగ్ లో ఎక్కడైనా తప్పులు దొర్లితే వాటిని సరిచేసే సలహాలు ఇస్తున్నాడు. ఆ సినిమాను తన సొంత సినిమాగానే భావించి పనిచేస్తున్నాడు.

ఆర్.ఆర్.ఆర్ బిజీలోనూ రాజమౌళి ఆ చిన్న సినిమాకి సమయం కేటాయిస్తున్నాడంటే? దాని వెనుక పెద్ద కారణమే ఉంటుంది గా. అసలు వివరాల్లోకి వెళ్తే రాజమౌళి ఫ్యామిలీ మెంబర్ సంగీత దర్శకుడు కీరవాణి తనయుడు సింహా కోడూరిని హీరోగా పరిచయం చేస్తూ మైత్రీ మూవీ మేకర్స్ `మత్తు వదలరా` అనే సినిమా నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. ఇది కాన్సెప్ట్ బేస్డ్ ఫిల్మ్. ఈ చిత్రానికి రితేష్ రానా అనే కొత్త కుర్రాడు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవలే ఈ చిత్రం షూటింగ్ పూర్తిచేసుకుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా దాదాపు పూర్తయ్యాయి.

ఈ నేపథ్యంలో సినిమాను రాజమౌళి.. తన కుటుంబ సభ్యులకు యూనిట్ చూపించిందిట. మొదటి నుంచి సినిమా విషయంలో జాగ్రత్తలు తీసుకుంటోన్న రాజమౌళి పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో సినిమాపై మరింత శ్రద్ద పెట్టినట్లు తెలుస్తోంది. స్క్రీనింగ్ అనంతరం రాజమౌళి ఆ సినిమాలో తప్పులను చూపిస్తూ… వాటిని కరెక్ట్ చేసుకోమని దర్శకుడికి సజ్జెస్ట్ చేసినట్లు సమాచారం. సినిమాలో కొన్ని సన్నివేశాల్లో చిన్నపాటి మార్పులు చేయాలని సూచించాడుట. కాన్సెప్ట్ బేస్డ్ సినిమా అంటే ఎలా ఉండాలో ? తన ఎక్స్ పీరియన్స్ ని సదరు యువ దర్శకుడితో పంచుకున్నట్లు సమాచారం. ఇక కీరవాణి మరో కుమారుడు భైరవ ఈ సినిమాతో సంగీత దర్శకుడిగా పరిచయమవుతోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని ఫిబ్రవరిలో రిలీజ్ చేయనున్నట్లు తెలిసింది.
Please Read Disclaimer