రాజశేఖర్- నరేష్ ఇద్దరిపైనా క్రమశిక్షణా చర్యలా?

0

మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) రచ్చ గురించి తెలిసిందే. ఇటీవల మా డైరీ 2020 ఆవిష్కరణలో గడబిడలు సర్వత్రా చర్చనీయాంశమయ్యాయి. దాదాపు 900 మంది మెంబర్స్ ఉన్న అతి పెద్ద అసోసియేషన్ లో ఒకరితో ఒకరికి పొసగని పరిస్థితిపై తీవ్రమైన కామెంట్లు వినిపిస్తున్నాయి. కలిసి కట్టుగా ఉండి నడిగర సంఘం తరహాలోనే సొంత భవంతిని నిర్మించుకోవాల్సింది పోయి కలహించుకుని కుంపట్లు పెట్టుకోవడం కక్షలు కార్పణ్యాలతో రగిలిపోవడం ఏమిటి? అంటూ విమర్శలు ఎదురవుతున్నాయి.

పెద్దల కమిటీ ఉన్నా.. ఎవరూ లెక్క చేయని పరిస్థితిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వేదికపైనే ఎమోషన్ అయ్యి రాజశేఖర్ విలన్ అయ్యారు. అయితే ఆయన అసోసియేషన్ కోసం సొంత డబ్బును సైతం ఖర్చు చేశారన్న చర్చా సభ్యుల్లో ఉంది. అయితే మా డైరీ ఆవిష్కరణలో పెద్దల ముందే ఎమోషన్ అవ్వడం వారిని వ్యతిరేకిస్తూ మాట్లాడడం అన్నది సమస్యాత్మకమైంది. దాంతో క్రమశిక్షణా చర్యలు తీసుకోవాల్సి వచ్చింది. ఆ వివాదం అనంతరం చిరంజీవి- మోహన్ బాబు-కృష్ణం రాజు వంటి పెద్దలతో ప్రత్యేకించి క్రమశిక్షణా కమిటీని బలోపేతం చేస్తున్నట్టు ప్రకటించారు. ఇకపై మా పరువు మర్యాదలు మంటకలిపే వారిపై సీరియస్ గానే యాక్షన్ ఉంటుందని తెలుస్తోంది.

అయితే మా రచ్చ ఇంతటితో ఆడినట్టేనా? అధ్యక్షుడు నరేష్ తో రాజశేఖర్ సమస్యలు సమసిపోయినట్టేనా? అంటే అలాంటిదేమీలేదు. తాజాగా జీవిత మాట్లాడుతూ.. హీరో రాజశేఖర్ పర్సనల్ కారణాల చేత రాజీనామా చేయలేదని.. కేవలం మా అధ్యక్షుడు నరేష్ వ్యహరశైలి నచ్చకే పదవికి రాజీనామా చేసారని వెల్లడించారు. నరేష్ వ్యవహారంపై బహిరంగంగా చెప్పినా సరైన చర్యలు తీసుకోలేదు. అందుకే రాజశేఖర్ ఆరోజు అలా ప్రవర్తించారు. ఇప్పుడు క్రమశిక్షణ కమిటీ ఏర్పాటైంది. కమిటీ ద్వారా న్యాయం చేస్తామని అన్నారు. క్రమశిక్షణ కమిటీ నిర్ణయం తర్వాత హీరో రాజశేఖర్ స్పందిస్తారు అంటూ జీవిత తెలిపారు. నరేష్ పై కమిటీ ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూస్తామని జీవిత అన్నారు. అంటే కొత్తగా ఏర్పడిన క్రమశిక్షణ కమిటీ రాజశేఖర్ తో పాటుగా నరేష్ పైనా చర్యలు తీసుకుంటుందన్న నమ్మకం జీవిత రాజశేఖర్ వ్యక్తం చేశారన్నమాట. రాజశేఖర్ తో పాటు నరేష్ తప్పులు చేశారన్నది వారి అభిమతం. మరి ఈ అంశాల్ని క్రమశిక్షణ కమిటీ పరిగణిస్తుందా లేదా? అన్నది చూడాలి.
Please Read Disclaimer