‘మా’ ప్రమాణ స్వీకారోత్సవంలో ‘నేను’ లొల్లి!

0

ఇటీవల కాలంలో మా ఎన్నికలు రాజకీయ ఎన్నికలకు ఏ మాత్రం తగ్గటం లేదు. ఈసారి జరిగిన ఎన్నికలు ఎంత హాట్ హాట్ గా జరిగాయో తెలిసిందే. ఫలితాలు వెలువడిన తర్వాత కూడా గెలిచిన.. ఓడిన వారి మధ్య మాటల యుద్ధం.. ప్రెస్ మీట్లతో ఒకరిపై ఒకరు విమర్శలు.. ఆరోపణలు సంధించుకన్నారు.

ఇదిలా ఉంటే.. ఈ రోజున మా కొత్త కార్యవర్గం ప్రమాణస్వీకారం చేసింది. మా అధ్యక్షుడిగా నరేశ్ ప్రమాణస్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆయన నోటి నుంచి ఒక్క మాట కొత్త వివాదానికి తెర తీయటమే కాదు.. మరో నటుడు రాజశేఖర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయటం.. నరేశ్ తీరును తప్పు పట్టటం లాంటివి చోటుచేసుకున్నాయి.

మా అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసేసందర్భంలో నేను అసోసియేషన్ కోసం బాగా కష్టపడతానని మాటిస్తున్నానని వ్యాఖ్యానించారు. నరేశ్ ప్రమాణస్వీకారం చేసిన తీరును సినీ నటుడు.. ఎగ్జిక్యూటివ్ వైఎస్ ప్రెసిడెంట్ రాజశేఖర్ అసంతృప్తి వ్యక్తం చేయటమే కాదు.. నరేశ్ మాట్లాడిన మాటతో నేను అనే పదం ఉందని.. ఎక్కడా మేము అని ఆయన అనలేదు.. ఇది సరికాదన్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో తనకు మాట్లాడటం ఇష్టం లేదని చెబుతూనే..నరేష్ అన్ని మాట్లాడేశారంటూ మైకును ఇచ్చేశారు. అనంతరం తన సతీమణి జీవిత నుంచి మైకు అందుకొని నేను మాట్లాడటానికి చాలా ఉంది. మీకు ఓపిక ఉంటే వినొచ్చు అంటూ.. నరేశ్ నేను.. నేను అనే పదాన్ని వాడి ఉండకూడదు. నేను ఈ కార్యక్రమానికి రావాలని అనుకోలేదు. కానీ..నరేశ్ వచ్చి పిలిచాడు.. అందుకు వచ్చాను.నరేశ్ నాకు మంచి మిత్రుడు..అందుకే వచ్చా. అందరం కలిసి ఈ అసోసియేషన్ ఎన్నికల కోసం బాగా పని చేశామన్నారు. మున్ముందు నరేశ్ మాట్లాడేటప్పుడు నేను అని కాకుండా మేము అని మాట్లాడితే బాగుంటుందంటూ సుదీర్ఘ అసంతృప్తిని వ్యక్తం చేశారు.

రాజశేఖర్ మాటలకు నరేశ్ స్పందిస్తూ.. తానేదో సరదాగా అన్నానని.. మనమందరం కలిసే చేశమని ఆయన్ను సముదాయించే ప్రయత్నం చేశారు. ఏదో అప్రయత్నంగా నరేశ్ నోటి నుంచి వచ్చిన నేను అన్న పదానికి రాజేశఖర్ అంత భారీగా అసంతృప్తిని వ్యక్తం చేయాలా? అన్న మాట వినిపిస్తోంది. ఈ లెక్కన రానున్న రోజుల్లో మరెన్ని విషయాల్లో మరెన్ని అభ్యంతరాలు తెర మీదకు వస్తాయో?
Please Read Disclaimer