మా డైరీ ఆవిష్కరణ: చిరు-రాజశేఖర్ మధ్య జరిగింది ఇది!

0

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(MAA) ఎప్పుడూ ప్రముఖంగా వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. మా వల్ల సినీ పరిశ్రమకు జరిగిన మేలు ఎంతో ఎప్పుడూ పెద్దగా చర్చకు రాదు కానీ మా లో ఉన్న లుకలుకలు మాత్రం ఎప్పుడూ హాట్ టాపిక్ అవుతుంటాయి. ఇక్కడ తప్పు ఎవరిది.. ఒప్పు ఎవరిది అనే అంశం కంటే కూడా ఒకరిపై ఒకరు రుసరుసలాడడం.. కొందరేమో విమర్శలు చేయడం.. ఇంకొందరు ఇతరులకు క్లాసులు పీకడం చాలా సాధారణ వ్యవహారం అయింది.

నిజానికి టాప్ లీగ్ స్టార్ హీరోలు ఎవ్వరూ మా కార్యక్రమాలకు హాజరు కావడం లేదు. మహేష్.. ఎన్టీఆర్.. ప్రభాస్.. చరణ్.. అల్లు అర్జున్ లాంటి ఎ-గ్రేడ్ స్టార్స్ ఈ సంఘానికి సంబంధించిన మీటింగ్స్ లో మచ్చుకైనా కనిపించరు అంటేనే ఈ సంఘం పట్ల టాలీవుడ్ ప్రముఖుల అభిప్రాయం ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక ఇక్కడ తరచుగా కనిపించేవారిలో సగ భాగం రచ్చ రంబోలా టైపు. మాట్లాడితే ఏదో ఒక వివాదం గ్యారెంటీ అన్నట్టుగా ఉంటుంది. ఇక రెండు గ్రూపుల మధ్య పోరాటం ఒక్కోసారి థ్రిల్లర్ సినిమాలను కూడా తలపిస్తుంది. ఈరోజు జరిగిన మా డైరీ 2020 ఆవిష్కరణ కార్యక్రమం రసాభాస అయింది.

ఈ కార్యక్రమంలో చిరంజీవి.. కృష్ణం రాజు.. మోహన్ బాబు.. రాజశేఖర్.. శివాజీరాజా తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పరుచూరి గోపాల కృష్ణ నుంచి హీరో రాజశేఖర్ మైక్ లాక్కోవడంతో ఇతర సీనియర్ హీరోలు అసహనానికి గురయ్యారు. ఇక చిరంజీవి మాట్లాడే సమయంలో ఎప్పటి లాగే శాంతి మంత్రం పఠిస్తూ ‘మా’ పరువు తీయొద్దని అందరికీ ఉద్బోధ చేశారు. మంచి ఉంటే మైక్ లో చెప్పాలని.. చెడు ఉంటే చెవిలో చెప్పాలని అన్నారు. ఇంట్లో ఏదైనా సమస్య ఉంటే సామరస్యంగా పరిష్కరించుకోవాలి కానీ బయట పెట్టుకుని మన పరువు మనమే తీసుకోవద్దని కాస్త మర్యాదగా క్లాస్ పీకారు.

అయితే రాజశేఖర్ మాత్రం తనదైన ధోరణిలో ఆవేశంగా “నేను ఇలా ఉండను. నేను సత్యంగా బతుకుతాను. నిజాలను చెప్తాను. దానివల్ల నిందలు వస్తే రానీ.. మేము చిన్న పిల్లలం కాదు. అక్కడ ఏదో ఒక మాట మాకు చెప్పి ఇక్కడకు తీసుకొచ్చి అసలు సమస్యలను కప్పిపుచ్చడం కుదరదు. ఏదైనా సరిగా జరగాలి” అంటూ మీ లౌక్యం… లోక నీతి తన దగ్గర చెల్లవని ఓపెన్ గానే ‘మా’లో గొడవలు ఉన్నాయి.. చిరంజీవి లాంటివారు కప్పిపుచ్చే ప్రయత్నాలు చేస్తున్నారని పరోక్షంగా తేల్చేశారు.

ఇలాంటి దబిడ దిబిడ స్పీచ్ తో ఎంతో సౌమ్యంగా ఉండే చిరంజీవి కూడా కాస్త చిరాకుపడ్డారు. తన అసహనం కాస్త కఠినమైన స్వరంలోనే వ్యక్తం చేశారు. “నేను ఇందాక చెప్పిన మాటకు విలువే ఇవ్వలేదు. పెద్దలంటే గౌరవం ఇవ్వనప్పుడు మేమెందుకు ఇక్కడ ఉండాలి? ఎందుకు రసాభాస చెయ్యడం? మన బలహీనతలను బైటకు చెప్పుకోవడం ఎంత ఇదిగా ఉంటుంది. ఆయన ఏది మాట్లాడినా సరే.. నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. అయాం వెరీ సారీ.. సజావుగా సాగుతున్న సభలో గౌరవం లేకుండా.. ప్రోటోకాల్ లేకుండా మైక్ లాక్కుని ఇలా చెయ్యడం ఏం మర్యాదో నాకు తెలియదు. ఇప్పటికీ నేను స్పందించకపోతే మీరిచ్చే పెద్దరికానికి అర్థం లేదు కాబట్టి మాట్లాడుతున్నాను. ఎంత సౌమ్యంగా మాట్లాడదామని అనుకున్నా సరే.. నా చేత కూడా ఎగ్రెసివ్ గా మాట్లాడేలా చేస్తున్నారు. ఎవరికీ కోపావేశాలు వద్దు. మీరు అనుకున్నది చెప్పండి. సలహాలు ఇవ్వండి. ఇలా మాట్లాడితే మన మీడియా మిత్రులు అసలైన విషయాన్ని పక్కన పెట్టి చిలవలు పలవలుగా రాస్తారు. ఈ మీటింగ్ కు హాజరు కావడం ఇష్టం లేకపోతే రాకూడదు” అన్నారు.

చిరంజీవి ఈ స్పీచ్ ఇస్తుండగానే లేచి బయటకు వెళ్ళబోయిన రాజశేఖర్ తిరిగివెనక్కు వచ్చి “ఇష్టంలేకుండా ఈ మీటింగ్ కు రాలేదు. ఇష్టం అయ్యే వచ్చాం. అందుకే నిజం మాట్లాడుతున్నా. నిజాలను కప్పి పుచ్చడం కుదరదు” అంటూ వెళ్ళిపోయారు. దీంతో చిరు మరింత విసిగిపోయి “ఉద్దేశ పూర్వకంగా రసాభాస చేయాలని వచ్చిన వారికి మనమేమీ చెప్పలేం. డిసిప్లీనరీ కమిటీ ఉంటే ఆయనపై కఠిన క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను” అన్నారు. చిరు చెప్పిన దానికి అక్కడ ఉన్న కృష్ణం రాజు.. మోహన్ బాబు లాంటి వారు తమ మద్దతు ప్రకటించారు.

చిరంజీవి చెప్పే మన గుట్టు మనమే బయట పెట్టుకోకూడదు అని చెప్పిన పాయింట్ నిజమే అయినప్పటికీ గొడవలు ఒక స్థాయి దాటినా తర్వాత బయటకు రాకుండా ఎలా ఉంటాయి? సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవడం అనేది ఎప్పుడూ మంచిదే. అలా అని సమస్య ఉన్నప్పటికీ దానికి పరిష్కారం చూపకుండా.. సమస్య ఉందని చెప్పిన వారిని అలా చెప్పకూడదు అనడం ఎంతవరకూ సబబు? రాజశేఖర్ మైక్ లాక్కోవడం లాంటివి గర్హనీయమే అయినా… ఆయన లేవనెత్తిన అంశం గురించి అక్కడ ఉన్న పెద్దలు ఏమాత్రం మాట్లాడకపోవడం. పరిష్కారం ఏంటో చెప్పకపోవడం.. రాజశేఖర్ తీరును మాత్రమె తప్పు బట్టడం కరెక్టేనా? ఈ అంశంపై మీరేమనుకుంటున్నారో కామెంట్స్ లో చెప్పండి.
Please Read Disclaimer