కాలేజ్ కుమార్.. ఇది మరో ట్రయలా?

0

సీనియర్ హీరోగా నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ చేయని ప్రయోగం లేదు. గొప్ప కామెడీ హీరోగా దశాబ్ధాల పాటు నటించిన రాజేంద్రుడు ఏడెనిమిదేళ్ల క్రితం రూటు మార్చి క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారారు. కెరీర్ చివరి వరకూ శోభన్ బాబులా హీరోగానే నటించాలన్న రూల్ ని బ్రేక్ చేస్తూ రాజేంద్రుడు ప్రయోగాత్మకంగా క్యారెక్టర్లకు ఓకే చెబుతున్నారు. ఆ నిర్ణయమే అతడికి కెరీర్ పరంగా అన్నిరకాలుగా కలిసొస్తోంది. ప్రస్తుతం ఏడాదికి డజను సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు.

2019 రాజేంద్ర ప్రసాద్ కి బాగానే కలిసొస్తోంది. ఆయన పలువురు స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తున్నారు. సంక్రాంతికి రిలీజైన `ఎఫ్2`లో కీలక పాత్రలో నటించారు. ఇటీవలే ఓ బేబి.. బుర్రకథ చిత్రాల్లో ఆసక్తికర పాత్రల్లో నటించి మెప్పించారు. ప్రస్తుతం అల్లు అర్జున్ .. మహేష్ సినిమాల్లోనూ నటిస్తూ బిజీగా ఉన్నారు. అయితే ఓవైపు క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తూనే అతడు హీరోగానూ `కాలేజ్ కుమార్` అనే సినిమా చేస్తుండడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.

ఇటీవల బర్త్ డే రోజున మూవీ కొత్త పోస్టర్ ని లాంచ్ చేశారు. ఈ పోస్టర్ లో రాజేంద్రుడు ఎంతో యంగ్ లుక్ తో కనిపిస్తున్నారు. కాలేజ్ కుమార్ అనగానే అక్కినేని నాగేశ్వరరావు నటించిన క్లాసిక్ సినిమా గుర్తొస్తుంది. ఆ పేరుకి తగ్గట్టే రాజేంద్ర ప్రసాద్ ఈ చిత్రంలో లెక్చరర్ గా నటిస్తున్నారని అర్థమవుతోంది. పోస్టర్ పై `విశ్వ విజేత` అని రాజేంద్రునికి కాంప్లిమెంట్లు ఇచ్చారు. ప్రిన్సిపాల్ .. ఫౌండర్ అంటూ పోస్టర్ పై వేయడం .. సాంకేతిక నిపుణుల పేర్ల ముందు లెకరర్స్ అని వేయడం ఆసక్తిని రేకెత్తించింది. హరి సంతోష్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని పద్మనాభ నిర్మిస్తున్నారు. మధుబాల- రాహుల్ విజయ్- ప్రియ వడ్డమాని తారాగణం. ప్రస్తుతం చిత్రీకరణ ముగింపులో ఉంది.

అలాగే బర్త్ డే రోజున `తోలు బొమ్మలాట` అనే వేరొక చిత్రం నుంచి రాజేంద్ర ప్రసాద్ లుక్ ని లాంచ్ చేశారు. ఈ సినిమాలోనూ పలువురు యువకథానాయకులు నటిస్తున్నా రాజేంద్రుని పాత్ర కీలకమైనదని అర్థమవుతోంది. ఇందులో ఓల్డేజ్ గెటప్ లో కనిపించారు. ఓ వైపు క్యారెక్టర్లు చేస్తూనే మధ్యలో లీడ్ పాత్రలతోనే రాజేంద్రుడు డబుల్ గేమ్ ఆడుతున్నారన్నమాట.
Please Read Disclaimer