రాజకీయాలు ఏమో కాని మరో సినిమా షూరూ

0

సూపర్ స్టార్ రజినీకాంత్ ఈ ఏడాది ఖచ్చితంగా రాజకీయాల్లోకి వస్తాడని అంతా భావించారు. వచ్చే ఏడాది ఎన్నికల్లో రజినీకాంత్ పోటీ చేయడం పక్కా అని ఆయన అభిమానులు భావించారు. రజినీకాంత్ రాజకీయ ప్లానింగ్ ను కరోనా పూర్తిగా దెబ్బ తీసింది. కరోనా కారణంగా బయటకు వెళ్లలేని పరిస్థితి. ఆయన ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉంటుంది. దాంతో ఆయన బయటకు వెళ్లి ప్రచారం చేయాలంటే భయం. ఆ కారణంగానే పార్టీ పెట్టే విషయమై ఆలోచనలో ఉన్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి. త్వరలో రాజకీయాల గురించి స్పష్టత ఇస్తానంటూ ప్రకటించిన రజినీకాంత్ మరో సినిమాకు కమిట్ అయినట్లుగా వార్తలు వస్తున్నాయి.

ప్రస్తుతం శివ దర్శకత్వంలో అన్నాత్తే సినిమాను రజినీకాంత్ చేస్తున్నాడు. ఆ సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాకుండానే మరో సినిమాకు ఓకే చెప్పాడట. తమిళ మీడియాలో వస్తున్న వార్తల అనుసారంగా రజినీకాంత్ తదుపరి సినిమా వచ్చే ఏడాది సమ్మర్ లో మొదలు కాబోతుందట. అది కూడా యంగ్ డైరెక్టర్ దర్శకత్వంలో అంటూ కథనాలు వస్తున్నాయి.

ప్రస్తుతం రజినీకాంత్ కరోనా కారణంగా ఇంటి నుండి బయటకు వెళ్లడం లేదు. అన్నాత్తే సినిమా షూటింగ్ లో వచ్చే ఏడాది నుండి పాల్గొంటాడని సమాచారం అందుతోంది. అన్నాత్తే పూర్తి అయిన వెంటనే సన్ పిక్చర్స్ లో రజినీకాంత్ తదుపరి సినిమా ఉండనుందట. రాజకీయాలపై క్లారిటీ ఇవ్వని రజినీకాంత్ ఇలా సినిమాలను బ్యాక్ టు బ్యాక్ చేస్తూ వస్తున్నాడు. సినిమాల ఎంపిక విషయం చూస్తే రాజకీయాలు లేనట్లే అనిపిస్తుందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.