మరో ‘గబ్బర్ సింగ్’ కాదు కదా?

0

సూపర్ స్టార్ల సినిమాలకు ఇవేం తిప్పలు? సినిమా రిలీజ్ కి ముందే క్యూరియాసిటీని చంపేసేలా లీకుల బెడద అంతకంతకు ఊపిరి సలపనివ్వడం లేదు. రజనీకాంత్.. కమల్ హాసన్.. విజయ్.. అజిత్ .. ఒకరేమిటి ఇలా లీకుల బారిన పడని టాప్ స్టార్ లేనే లేరు. ఇంతకుముందు దళపతి విజయ్ -అట్లీ కాంబినేషన్ మూవీ బిగిల్ కి సంబంధించిన లీక్డ్ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో జోరుగా వైరల్ అయ్యాయి. అప్పట్లోనే విజయ్ టీమ్ సీరియస్ అయ్యారు. నేడు.. కమల్ హాసన్- శంకర్ కాంబినేషన్ మూవీ భారతీయుడు 2 కథ ఇదేనంటూ ఓ లీక్ వైరల్ గా ప్రచారమైంది. ఈలోగానే సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న దర్బార్ ఆన్ లొకేషన్ స్టిల్స్ పక్కా క్వాలిటీతో సామాజిక మాధ్యమాల్లోకి లీకైపోయాయి. అంతేకాదు ఈ సినిమా కథ ఇదీ అంటూ ఓ ప్రచారం వేడెక్కించేస్తోంది.

ఇప్పటికే రిలీజైన లీక్డ్ ఫోటోల్లో రజనీకాంత్ ఖాకీ ధరించి ఏదో సీరియస్ ఆపరేషన్ కి రెడీ అవుతున్నట్టే కనిపిస్తున్నారు. తనతో పాటే అందాల నయనతార డార్క్ బ్లూ కలర్ దుస్తుల్లో కనిపిస్తున్నారు. ఈ జంటపై ప్రస్తుతం ముంబైలో కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు మురుగదాస్. అయితే ఇలా సోషల్ మీడియాలో ఫోటోలు లీకవ్వడంతో అతడు హర్టయ్యారని తెలుస్తోంది. అందుకు కారకులపై సీరియస్ యాక్షన్ తీసుకునేందుకు రెడీ అవుతున్నారట. అండర్ ప్రొడక్షన్ ఉండగానే ఇలా లీకవ్వడం అన్నది అతడిని తీవ్రంగానే కలచి వేస్తోందట.

అలాగే `దర్బార్` కథ గురించి.. రజనీ పాత్ర గురించిన లీకులు అంతకంతకు సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. మారుతున్న సంఘంలో నేరాలు ఘోరాలు దారుణంగా పెరిగిపోతున్నాయి. ఇంకా బూజు పట్టిన పాత చట్టాల్ని ఫాలో చేస్తే పోలీసులు ఈ నేరాల్ని ఆపగలరా? అందుకే తనకంటూ ఓ చట్టం తయారు చేసుకుని దాంతో ఆధునిక సమాజంలో సమస్యల్ని పరిష్కరించే పోలీస్ అధికారిగా రజనీకాంత్ కనిపించనున్నారని తెలుస్తోంది. అయితే ఈ కథ వింటుంటే కాస్తంత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటంచిన గబ్బర్ సింగ్ పోలికలు కనిపిస్తున్నాయి. అక్కడ తిక్క రేగినా లెక్క ఉంటుంది. మరి ఇక్కడేం ఉంటుందో రజనీనే చెప్పాల్సి ఉంటుంది. ఇక ఈ కథాంశాన్ని రజనీ మార్క్ సీరియస్ డ్రామాతో దర్శకుడు మురుగదాస్ చూపిస్తున్నారా? అన్నది చూడాలి. తమిళం- తెలుగు- హిందీలో ఈ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. ప్రతీక్ బబ్బర్- సునీల్శెట్టి- నివేదా థామస్- యోగిబాబు తదితరులు ఈ చిత్రలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Please Read Disclaimer