తనను అవమానించిన నిర్మాత గురించి చెప్పిన రజనీ

0

ఎంత ప్రముఖుడైనా ఆరంభంలో అన్నో ఇన్నో అవమానాలు తప్పనిసరి. అందుకు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ సైతం మినహాయింపు కాదు. ఒక నిర్మాత తనను అవమానించిన వైనాన్ని చెప్పిన వైనం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఒకరకంగా ఆ అవమానమే తనను కష్టించి పని చేసి.. కసిగా పైకి ఎదిగేలా చేసిందన్న విషయాన్ని ఆయన చెప్పుకొచ్చారు. అభిమానులతో షేర్ చేసుకున్న ఈ ఉదంతం ఇప్పుడు వైరల్ గా మారింది.

ఒక నిర్మాత తీరుతో రజనీకి ఎదురైన అవమానం ఆయన మాటల్లోనే చెబితే..
“నటుడిగా నాలుగైదు సినిమాలు చేశాక ఓ నిర్మాత ఫోన్ చేసి తన సినిమాలో వేషం ఉందన్నాడు. మీరే చేయాలన్నాడు. రెమ్యునరేషన్ రూ.6వేలు.. అడ్వాన్స్ వెయ్యిగా చెప్పాడు. అందుకు ఓకే చెప్పా. మరుసటి రోజు కారుతో పాటు అడ్వాన్స్ పంపుతానన్నాడు. ఉదయం ఎనిమిదిన్నరకు రావాల్సిన కారు తొమ్మిది గంటలకు వచ్చింది. అడ్వాన్స్ మాత్రం రాలేదు. అడిగితే.. తెలీదన్నాడు. సెట్ కు వచ్చిన తర్వాత ప్రొడక్షన్ మేనేజర్ అడ్వాన్స్ ఇస్తారన్నారు కానీ ఇవ్వలేదు. ఇదే విషయాన్ని సదరు మేనేజర్ ను అడిగితే.. మేకప్ వేసుకునే టైంకు ఇస్తానని చెప్పారు.

అదేంటి ముందే అడ్వాన్స్ ఇస్తామన్నారు కదా? అని అడిగితే.. తర్వాత ఇస్తామన్నారు. ఆ మాటకు కుదరదన్నారు. అప్పుడే పెద్ద కారులో నిర్మాత దిగారు. అడ్వాన్స్ ఇస్తేనే నటిస్తానని చెబుతున్నావట.. నువ్వేమైనా గొప్ప నటుడివి అనుకుంటున్నావా? అడ్వాన్స్ ఇవ్వకపోతే సినిమా చేయనన్నావట. నీలాంటోళ్లను ఎంతమందిని చూసుంటాను. నీకు నా సినిమాలో వేషం లేదు.. మర్యాదగా బయటకు వెళ్లిపో అన్నారని చెప్పారు.

తాను పిలిస్తేనే వచ్చానని.. కారులో తీసుకొచ్చిన దానికి తనను కారులో ఇంటి వద్ద దింపాలంటే కుదరదన్నారని.. దీంతో కోపంతో ఏవీఎం స్టూడియో నుంచి నడుచుకుంటూ రోడ్డు మీదకు వచ్చేసిన వైనాన్ని గుర్తు చేసుకున్నారు. తనను అంతలా అవమానించిన దానికి తానేమిటో చూపించాలని ఫిక్స్ అయినట్లు చెప్పారు. తనను అన్ని మాటలు అన్నందుకైనా తాను పైకి రావాలని.. పెద్ద కారులో అదే స్టూడియోలోకి వెళ్లాలనని తాను అనుకున్నట్లు చెప్పారు.

రెండున్నరేళ్లు బాగా కష్టపడి పేరు.. డబ్బులు సంపాదించిన తర్వాత నాలుగున్నర లక్షలు ఖర్చు చేసి మరీ ఇటాలియన్ మోడల్ కారును కొన్నానని.. రాబిన్ సన్ అనే అంగ్లో ఇండియన్ ను డ్రైవర్ గా పెట్టుకొని ఫస్ట్ ఏవీయం స్టూడియోకు వెళ్లి.. ఎక్కడైతే తనను ఆ నిర్మాత అవమానించాడో అక్కడే తన కారును నిలిపి.. బయటకు దిగి స్టైల్ గా సిగిరెట్లు కాల్చినట్లు చెప్పారు. తర్వాత తన గురువు బాలచందర్ వద్దకు వెళ్లి ఆశీర్వాదం తీసుకున్న వైనాన్ని గుర్తు చేసుకున్నారు. ఇదంతా ఓకే కానీ తనను అంతలా అవమానించిన ఆ నిర్మాత పేరును మాత్రం రజనీ రివీల్ చేయలేదు.
Please Read Disclaimer