వైరల్ అవుతున్న సూపర్ స్టార్ లైఫ్ స్పీచ్..

0

ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కేవలం స్టైల్ తోనే సూపర్ స్టార్ అయిన హీరో రజినీకాంత్. ఆయన నడకలో.. ఆయన చేసే ప్రతీ యాక్షన్లో ఒక స్టైల్ కనిపిస్తుంది. సూపర్ స్టార్ తలైవర్.. అప్పటి నాటి హీరోల నుండి నేటి యంగ్ హీరోలకు సైతం పోటీగా నిలుస్తూ వస్తున్నాడు. తలైవర్ సినిమా అంటేనే అభిమానులలో ఎక్కడలేని ఊపు కన్పిస్తుంది. స్టైలుతో కోట్లాది అభిమానులను సంపాదించుకొని నేటికీ హీరోగా థియేటర్లలో రికార్డులు సృష్టిస్తుంది కేవలం రజిని ఒక్కడే. ఇటీవలే ‘దర్బార్’ సినిమా విజయంతో ఊపులో ఉన్న రజిని ప్రస్తుతం ‘శంఖం’ ఫేమ్ శివ దర్శకత్వంలో తన 168వ సినిమాను పూర్తిచేస్తున్నాడు. అయితే ఎక్కడో బెంగళూరులోని ఓ ట్రాన్స్ పోర్ట్ సర్వీసులో కండక్టర్గా ప్రారంభమైన ఆయన ప్రయాణం.. సూపర్స్టార్గా మారే వరకు ఆయన జీవితంలో ఎంతో కృషి ఉంది.

తన దర్బార్ సినిమా ఆడియో ఫంక్షన్లో రజినీ మాటలు ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నాయి. ఆయన మాట్లాడుతూ.. ‘మొదటగా నాకు డైరెక్టర్ భారతీరాజా తెరకెక్కించిన ‘16 వయతినిలే’ సినిమాలోని పరట్టయి పాత్రతో తమిళనాడులో మంచి గుర్తింపు లభించింది. అప్పటికే కొన్ని నటించాను. కానీ ఆ క్యారెక్టర్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. అయితే ఆ సినిమా విడుదలైన తర్వాత ఓ నిర్మాత నుంచి కబురు వచ్చింది. ఓ పెద్ద హీరో సినిమాలో పాత్రకు ఓకే చెప్పాను. పారితోషికం మాట్లాడుకొని డేట్స్ కూడా ఇచ్చాను. అయితే ఈ సినిమాలో నా పాత్ర కన్ఫర్మేషన్ కోసం అడ్వాన్స్ ఇవ్వమని అడిగితే షూటింగ్కు వచ్చాక ఇస్తామని చెప్పారు. తీరా షూటింగ్కు వెళ్లాక హీరో వచ్చే టైం అయింది మేకప్ వేసుకొమ్మని అన్నారు. కానీ నేను అడ్వాన్స్ ఇవ్వందే మేకప్ వేసుకోనని చెప్పాను. అప్పుడే అంబాసిడర్ కారులో ఏవీఎమ్ స్టూడియోకు వచ్చిన నిర్మాత ఆగ్రహంతో ఊగిపోయారు. నువ్వేమైన పెద్ద స్టార్ అనుకుంటున్నావా..? ఎన్ని చిత్రాలు చేశావు? నీకంటూ ఏం గుర్తింపు ఉంది? అంటూ నాపై అరిచారు. చివరికి ఈ సినిమాలో నీకు అవకాశం లేదని చెప్పి వెళ్లిపొమ్మన్నారు.

అయితే ప్రస్తుతం తన దగ్గర డబ్బులు లేవని కనీసం మీ కారులోనైనా ఇంటి దగ్గర దిగబెట్టాలని కోరితే ఆయన అస్సలు ఒప్పుకోలేదు. పైగా నడుచుకుంటూ వెళ్లమని వెకిలిగా మాట్లాడారు. అప్పుడే నిర్ణయించుకున్నాను మళ్ళీ ఏవీఎం స్టూడియోలో అడుగుపెడితే అది ఫారెన్ కారుతోనే అని. సరిగ్గా రెండున్నరేళ్ల తర్వాత ఓ పెద్ద సినిమాలో నటించే అవకాశం వచ్చింది. భారీ పారితోషికం ఇచ్చారు. వెంటనే ఫియట్ కారు కొని డ్రైవర్ ని కూడా పెట్టుకున్నా.. అతనికి ప్రత్యేకమైన సూట్ కూడా కుట్టించాను. ఏవీఎం స్టూడియోలో ఫారిన్ కారు డ్రైవర్ చేతిలో రెండు సిగరెట్లతో స్టైల్గా దిగి నా కల నెరవేర్చుకున్నా. అయితే సినీ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే తెలివితేటలు కష్టపడేతత్వం ఉంటేనే సరిపోదు. మనం ఉండే స్థానం సమయం.. అభిమానుల ఆశీర్వాదం కూడా ఉండాలని’ ఎంతో స్ఫూర్తిదాయకంగా మాట్లాడి అలరించాడు తలైవర్.
Please Read Disclaimer