రకుల్ దెబ్బకు మీడియా కు మొట్టికాయలు?

0

ఎవరూ గీత దాటకూడదు. కానీ.. అందుకు భిన్నంగా తమకు తోచినట్లుగా వ్యవహరించే ధోరణి మీడియాలో ఎక్కువ అవుతుంది. బాలీవుడ్ డ్రగ్స్ కేసుకు సంబంధించి ముంబయిలో చోటు చేసుకున్న హైడ్రామానే దీనికి నిదర్శనం. అధికారుల విచారణకు హాజరయ్యే సినీ తారలను ప్రశ్నించేందుకు కొన్ని చానళ్లు వ్యవహరించిన తీరు చూసి.. ఇదెక్కడి ఆరాచకమని ఫీలైనోళ్లు లేకపోలేదు. కొన్ని చానళ్లు తమకు తామే కోర్టులుగా భావిస్తూ తీర్పులు చెప్పేసేలా వ్యాఖ్యలు చేయటం.. ముఖం ముందు మైకు పెట్టేసి.. నేను అడుగుతాను.. నువ్వు చెబుతావా? లేదా? అంటూ ఫోర్సు చేసిన తీరుకు చాలామంది అవాక్కు అయ్యారు.

చానళ్ల అత్యుత్సాహానికి చాలామంది సినీ తారలు.. సెలబ్రిటీలు నొచ్చుకున్నా.. నోరు మూసుకున్నారే తప్పించి సరైన తీరులో వ్యవహరించింది లేదు. కొద్దిమంది మాత్రంసోషల్ మీడియాలో తమ ఆవేదనను వ్యక్తం చేశారు. అయితే.. బాలీవుడ్ డ్రగ్స్ కేసులో టాలీవుడ్ నటి రకుల్ ప్రీత్ సింగ్ పేరు బయటకు రావటం సంచలనంగా మారింది. ఆమె పాత్ర ఎంతన్న విషయంపై క్లారిటీ లేకున్నా.. ఆమె ఫోటోలు వేసేసి ప్రింట్ మీడియా.. ఆమె ఫోటోలు.. వీడియోల్ని ప్రసారం చేస్తూ చానళ్లు పండగ చేసుకున్నాయి.

వీరి తీరుకు ఒళ్లు మండిన ఆమె మిగిలిన వారికి భిన్నంగా రియాక్ట్ అయ్యారు. నిజాల్ని.. ఆధారాల్ని వదిలేసి.. అదేపనిగా విమర్శించటం.. ఆరోపణల పేరుతో బురద జల్లుతున్న తీరును తప్పు పడుతూ.. చానళ్లకు ఈ అధికారం ఎవరిచ్చారు? అన్న క్వశ్చన్ ను సంధించారు రకుల్. అదేదో సోషల్ మీడియాలో పోస్టు పెట్టటం లాంటి పనులు చేయకుండా.. ఏకంగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.

నిజానిజాలు తేలకుండానే తన పరువుకు నష్టం కలిగేలా కార్యక్రమాల్ని ప్రసారం చేస్తున్నట్లుగా చెప్పిన ఆమె.. తనకు న్యాయం చేయాలని కోరారు. ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన ఢిల్లీ హైకోర్టు తాజాగా కీలక వ్యాఖ్యలు చేసింది. చానళ్లకు హోల్ సేల్ సూచన చేస్తున్నట్లుగా చేస్తూనే.. ఇవ్వాల్సిన వార్నింగ్ ఇచ్చేశారని చెప్పాలి. ప్రైవేటు టీవీ చానళ్లు అన్ని కచ్ఛితంగా తమ ప్రోగ్రామ్ కోడ్ ను అనుసరించి పని చేయాలని.. ఎవరినైనా సరే విమర్శించేలా.. అప్రతిష్టపాలు చేసేలా ఉండరాదని కోరింది.

పరువునష్టం కలిగించే విధంగా తప్పుడు వార్తల్ని ప్రసారం చేయటం.. ఉద్దేశపూర్వకంగా అర్థసత్యాల్ని వార్తల రూపంలో జనాల మీదకు వదలటం లాంటివి చేయకూడదని పేర్కొంది. వ్యక్తుల్ని.. సమూహాన్ని.. దేశంలోని సామాజిక.. నైతిక జీవనంపై విమర్శలు చేయకూడదని చెప్పింది. తాము చెప్పిన సూచనల్ని తప్పకుండా పాటించాలని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. మొత్తానికి చెలరేగిపోతున్న చానళ్ల దూకుడుకు సైలెంట్ గా చెక్ చెప్పిన రకుల్ ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే.