అభిమాని ఫ్యామిలీకి మెగా సాయం

0

గ్రేటర్ హైదరాబాద్ చిరంజీవి యువత అధ్యక్షుడు నూర్ అహ్మద్ గత ఆదివారం గుండెపోటుతో మృతి చెందిన సంగతి తెలిసిందే. విషయం తెలిసిన వెంటనే మెగా స్టార్ చిరంజీవి- నిర్మాత అల్లు అరవింద్- బన్నీ నూర్ భాయ్ ఇంటికెళ్లి ఆ కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా అభిమానుల పక్షాన నిలబడిన నూర్ జ్ఞాపకాలను మెగా ఫ్యామిలీ గుర్తు చేసుకుంది. అయితే రామ్ చరణ్ అందుబాటు లేకపోవడంతో ఆ కుటుంబాన్ని ఇంకా పరామర్శించలేదు.

తాజాగా నూర్ కుటుంబాన్ని కలుస్తానని చరణ్ ఓ ప్రకటనలో వెల్లడించారు. అలాగే ఆ కుటుంబానికి 10 లక్షలు విరాళం ప్రకటించారు. అనంతరం నూర్ భాయ్ సేవల్ని గుర్తు చేసుకున్నారు. నూర్ భాయ్ మెగా అభిమానులందరిలోకి గొప్ప వ్యక్తి. ఆయన మెగా ఫ్యామిలీ పేరిట ఎన్నో రక్తదాన శిబిరాలు నిర్వహించారు. మా పుట్టినరోజును పురస్కరించుకుని ప్రజలకు ఉపయోగపడే పనులు ఎన్నో చేశారు. ఆయన లేని లోటు తీర్చలేనిది. ఒకసారి ఆసుపత్రిలో ఉన్నప్పుడు నేనే స్వయంగా అక్కడికి వెళ్లి పరామర్శించి వచ్చాను. అక్కడ డాక్టర్లతో మాట్లాడి మెరుగైన వైద్యం చేయించాను. కానీ నిన్న మరణ వార్త విని చలించిపోయాను. మా కుటుంబానికి..తన కుటుబానికి ఆ లోటు ఎప్పటికీ ఉంటుంది. నూర్ భాయ్ కుటుంబానికి నా ప్రగాఢ సానుబూతి తెలుపుతున్నాను.. అని అన్నారు.

అభిమానులు కష్టాల్లో ఉన్నప్పుడు ప్రతిసారీ మెగా ఫ్యామిలీ హీరోలు ఆదుకుంటున్న సంగతి తెలిసిందే. నూర్ సడెన్ డెత్ విషయంలో చిరు -చరణ్ స్పందించిన తీరుకు పరిశ్రమలో అభిమానుల్లో హర్షం వ్యక్తమవుతోంది.
Please Read Disclaimer