చెర్రీకి అవార్డులకొచ్చే టైమ్ ఉంటుందా?

0

కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ అధినేత .. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం `సైరా` ప్రమోషన్స్ బిజీలో ఉన్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 2 రిలీజ్ ని పురస్కరించుకుని ఈ 18 రోజులు ప్రచారం సహా రిలీజ్ సాఫీగా జరిగేలా ప్లాన్ చేయడంతోనే సరిపోతోంది. ఇప్పటికే నిర్మాణానంతర పనుల్ని పర్యవేక్షిస్తూ .. వీఎఫ్ ఎక్స్ పనుల బెటర్ మెంట్ కోసం ట్రై చేస్తూ చరణ్- సురేందర్ రెడ్డి బృందం పూర్తి బిజీగా ఉన్నారని తెలుస్తోంది. తెలుగు-తమిళం-హిందీ-మలయాళం- కన్నడం ఇన్ని భాషల్లో పాన్ ఇండియా కేటగిరీలో సైరా రిలీజవుతోంది. ఆ మేరకు బిజినెస్ డీల్స్ సహా ప్రతిదీ ఠఫ్ టాస్కులే అనడంలో సందేహం లేదు. వీటన్నిటినీ రామ్ చరణ్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.

ఇకమీదట ఈ పదిహేను రోజులు అన్ని మెట్రో నగరాల్లోనూ ప్రచారం చేయాల్సి ఉంది. ఈనెల 18న ప్రీరిలీజ్ ఈవెంట్ మొదలు అన్నిచోట్లా కవర్ చేసేందుకు ప్లాన్ చేశారని తెలుస్తోంది. అయితే ఇంత హడావుడిలోనూ రామ్ చరణ్ కి ఓ అవార్డు వేడుకకు ఆహ్వానం అందనుందని తెలుస్తోంది. ఈనెల 29న హైదరాబాద్ నోవోటెల్ హోటల్లో `సంతోషం అవార్డ్స్ 201`9 వేడుక జరగనుంది. ఈ వేదికపై రామ్ చరణ్ `రంగస్థలం` చిత్రానికి గాను అవార్డును అందుకుంటారని చెబుతున్నారు.

అయితే ఓవైపు `సైరా` ప్రమోషన్స్ లో అంత బిజీగా ఉండి మూడు రోజుల ముందు జరిగే ఈ వేడుకకు ఎటెండ్ కాగలరా? అంటూ సందిగ్ధం వ్యక్తమవుతోంది. గతంలో జరిగిన సంతోషం అవార్డ్స్ ఈవెంట్స్ కి చిరంజీవి- చరణ్- అల్లు అరవింద్ బృందం ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈసారి ఆ ఛాన్స్ ఉంటుందా? అన్నది వేచి చూడాలి. ఊపిరి సలపని షెడ్యూల్స్ లో చరణ్ బిజీగా ఉన్న నేపథ్యంలో ఈ వేడుకకు విచ్చేస్తారా లేదా అన్నది తెలియాల్సి ఉందింకా.
Please Read Disclaimer