‘చిరుత’ నయుడు ఇస్మార్ట్ పొగడ్త దేనికి సంకేతం?

0

గత కొంత కాలంగా హిట్టు అన్న మాట కోసం ఎదురు చూస్తున్న డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఎట్టకేలకు `ఇస్మార్ట్ శంకర్`తో ఆ ఒక్క హిట్టు ఖాతాలో పడింది. పూరి టీమ్ పార్టీలు సెలబ్రేషన్స్ తో హడావుడి చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటివరకూ దీనిపై ఏ పెద్ద హీరో ప్రశంసలు కురిపించలేదు. చిన్న సినిమాని సైతం ఎంకరేజ్ చూస్తూ ట్వీట్ లు పెట్టే అగ్ర హీరో మహేష్ అయితే అసలే స్పందించలేదు. గత కొంత కాలంగా పూరికి మహేష్ కి మధ్య గ్యాప్ గురించి ఆసక్తికర చర్చ సాగుతోంది. అయితే ఎవరు బాసటగా నిలిచినా నిలవక పోయినా నేనున్నానంటూ.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ స్పందించడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇస్మార్ట్ శంకర్ చిత్రంలో క్యారెక్టరైజేషన్.. పూరి మార్క్ ఎనర్జీ నచ్చాయని చెర్రీ ప్రశంసించారు. దీంతో `చిరుత`నయుడి ప్రశంస దేనికి సంకేతం అన్న ఆసక్తికర చర్చ సాగుతోంది.

చిరంజీవితో సినిమా చేయాలన్నది పూరి జగన్నాథ్ చిరకాల కోరిక. ఇదివరకూ `ఆటో జానీ` పేరుతో చిరుకి ఓ కథని వినిపించాడు కూడా. సెకండ్ హాఫ్ నచ్చకపోవడంతో చిరంజీవి అప్పటికి కాదని అన్నారు. కానీ ఆ విషయాన్ని మాత్రం పూరికి చెప్పలేదు. ఓ సందర్భంలో మీడియా పూరి చిత్రాన్ని ఎందుకు పక్కన పెట్టారని చిరుని అడిగితే సెకండ్ హాఫ్ తనకు నచ్చలేదని – అందుకే దాన్ని పక్కన పెట్టానని చెప్పేశారు. దీంతో పూరి తీవ్రంగానే హర్టయ్యాడు. ఆ విషయం మీడియాకు చెప్పడకుండా నేరుగా తనకే చెబితే బాగుండేది కదా!! అని పలువురి ముందు పూరి వాపోయాడు. అక్కడి నుంచి మెగా క్యాంప్ కు దూరంగా వుంటూ వచ్చాడు. అయితే ఇస్మార్ట్ సక్సెస్ తర్వాత పూరి బాణి మారింది. మరోసారి చిరుతో సినిమా టాపిక్ ని లేవనెత్తాడు. ఆ క్రమంలోనే రామ్ చరణ్ `ఇస్మార్ట్ శంకర్`ను చూడడం.. ప్రశంసల్లో ముంచెత్తడంతో పూరిలో కొత్త ఆశ చిగురించిందిట.

పూరి ఇండస్ట్రీ హిట్ ని అందించిన హీరో మహేష్ తో పాటు సీనియర్ టాప్ హీరోలెవరూ ఇస్మార్ట్ పై స్పందించలేదు కానీ రామ్ చరణ్ స్పందించి ప్రశంసలు కురిపించడంతో పూరితో చిరు-రామ్ చరణ్ లకు దగ్గరయ్యారన్న సంకేతాలు అందుతున్నాయి. చెర్రీ ప్రశంస పూరీకి ఎలా వర్కవుటవుతుందో చూడాలి. ఇక చిరంజీవి సైతం ఇస్మార్ట్ శంకర్ ప్రివ్యూని వీక్షించేందుకు రెడీ అయ్యారన్న వార్తలు వచ్చాయి. బాస్ స్పందన ఎలా ఉంటుందో మరి.