`సైరా` కోసం RRRకి బ్రేకులా?

0

దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్.ఆర్.ఆర్ కి తొలి నుంచి రకరకాల కారణాలతో బ్రేకులు పడుతున్న సంగతి తెలిసిందే. సెట్ లో ఒకసారి చరణ్ కి.. మరోసారి తారక్ కి గాయాలవ్వడంతో బ్రేకులిచ్చారు. ఆ తర్వాత రాజమౌళి వారసుడి పెళ్లి కోసం మరో బ్రేక్ పడింది. ఇటీవలే చరణ్ కి మరోసారి గాయం అయ్యిందంటూ ప్రచారం సాగినా దానిని చిత్రయూనిట్ ఖండించింది. ప్రస్తుతం హైదరాబాద్ పరిసరాల్లో షూటింగ్ సజావుగానే సాగుతోంది. అయితే ఈలోగానే మరో కొత్త పుకార్ తెరపైకొచ్చింది. ఇది పుకార్ నా? లేక వాస్తవమా? అన్నది తెలీదు కానీ.. మరోసారి ఆర్.ఆర్.ఆర్ కి బ్రేక్ పడనుందంటూ తామరతంపరగా ఒకటే ప్రచారం సాగుతోంది.

ఈసారి కారణం కూడా ఇంట్రెస్టింగ్. చరణ్ తాను నిర్మిస్తున్న సినిమా(సైరా) కోసం నటిస్తున్న సినిమా(ఆర్.ఆర్.ఆర్)కి బ్రేకులు వేస్తున్నారని.. అది కూడా డాడ్ చిరంజీవి కోసం ఇలా చేస్తున్నారని ప్రచారం సాగుతోంది. ఓవైపు ఆర్.ఆర్.ఆర్ చిత్రీకరణలో బిజీగా ఉన్న రామ్ చరణ్ తదుపరి `సైరా-నరసింహారెడ్డి` ప్రచారానికి రెడీ అవుతున్నారు. అందుకు ప్రత్యేకమైన ప్లాన్స్ రెడీ చేశారు. సైరా రిలీజ్ కి ఇంకెంతో సమయం లేదు. కేవలం రెండు నెలల సమయం మాత్రమే మిగిలి ఉంది కాబట్టి ఈలోగానే ఈ చిత్రానికి చేయాల్సిన ప్రచారం చాలానే ఉందని భావిస్తున్నారట. ఇండియన్ సినిమా హిస్టరీలో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమాల్లో సైరా ఒకటి. చిరంజీవి కెరీర్ లోనే ఇది ఎంతో ప్రతిష్ఠాత్మక చిత్రం. అందుకే చరణ్ ఈ సినిమా విషయమై తొలి నుంచి ఎంతో జాగ్రత్త తీసుకుంటున్నారు. నిర్మాతగా సురేందర్ రెడ్డికి చేయాల్సిన సాయం అంతా చేశారు. డాడ్ కి సక్సెస్ ని గిఫ్ట్ గా ఇస్తానన్న మాట నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాడట.

అందుకే చివరి నిమిషంలో ఎలాంటి పొరపాటు జరగకుండా తనవంతు హార్డ్ వర్క్ చేయనున్నారట. సైరాకి ఈ రెండు నెలల్లో ప్రచారం పరంగా ఊపు తేవాలన్నది ప్లాన్. అందుకు రకరకాల వేదికల్ని ఉపయోగించుకోనున్నారు. సౌత్ అన్ని భాషలతో పాటు అటు హిందీలోనూ ఈ చిత్రం రిలీజ్ కానుంది. అందువల్ల ప్రచారంలోనూ అంతే వైవిధ్యం పాటించనున్నారు. ఈ ప్రచారం కోసమే చరణ్ బ్రేక్ తీసుకోవాలని అనుకుంటున్నారని తెలుస్తోంది. ఆ విషయం ముందుగానే జక్కన్నకు కూడా హింట్ ఇచ్చేశారట. గాంధీ జయంతి కానుకగా అక్టోబర్ 2న సైరాను విడుదల చేస్తున్నారు. స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో నయనతార- తమన్నా -అమితాబ్ బచ్చన్- జగపతిబాబు- సుదీప్- విజయ్ సేతుపతి- అనుష్క కీలక పాత్రలు పోషిస్తున్నారు. పరుచూరి సోదరులు సహా బుర్రా సాయి మాధవ్ రచయితలుగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
Please Read Disclaimer