పవన్ కథలు వింటున్నారా? ఆ మాట చెప్పిందెవరో తెలుసా?

0

నటుడిగా ఎంట్రీ ఇచ్చి.. కోట్లాది మంది మనసుల్ని దోచేసుకున్న తర్వాత.. దాన్నించి దూరంగా వెళ్లిపోవటం అంత తేలికైన విషయం కాదు. దూరం జరిగిన తర్వాత కూడా దగ్గరకు లాగే గుణం సినిమాకు ఉంది. ఎంతోమంది సినిమాల నుంచి బయటకెళ్లిన తర్వాత తిరిగి రావటం చూసిందే. ఇప్పుడు అలాంటి పరిస్థితే జనసేన అధినేత.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ విషయంలో మరోసారి నిజమైందని చెప్పాలి.

ప్రజాజీవితంలో తలమునకలయ్యేందుకు సినిమాలకు దూరమవుతున్నట్లుగా పవన్ ప్రకటించారు. తర్వాతి కాలంలో ఆయన మళ్లీ సినిమాల్లో నటించేందుకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వచ్చినప్పటికీ.. వెంటనే ఆ వార్తల్ని ఖండిస్తూ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. తానిక రాజకీయాలకే పరిమితమవుతానని.. నిజానికి సినిమాల్లో నటించటం తనకు ఇష్టముండదన్న సంచలన వ్యాఖ్య పవన్ నోటి నుంచి వచ్చింది.

అయితే.. పవన్ సినిమాల్లోకి మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వనున్నారా? అన్న ప్రశ్నకు అత్యంత విశ్వసనీయమైన సమాధానం లభించింది. అందుకు అవుననే మాట చెర్రీ నోటి రావటం.. పవర్ స్టార్ అభిమానులు అసలుసిసలైన పండుగ వార్తగా చెప్పక తప్పదు. పవన్ బాబాయ్ రకరకాల కథలు వింటున్నారు. అయితే.. ఏ చిత్రాన్ని అంగీకరించటం లేదన్నారు.

కథలు వింటున్నారంటే.. సినిమాలు చేసే ఉద్దేశంతోనే ఉంటారన్న వాదన కొందరు వినిపిస్తుంటే.. అలానే ఎందుకనుకోవాలి? సొంత ప్రొడక్షన్ కోసమో.. కొడుకును లాంఛ్ చేయటం కోసమో కథలు వినొచ్చుగా అన్న మాట వినిపిస్తోంది.

ఏమైనా పవన్ కల్యాణ్ కథలు వినటమంటే.. ఇవాళ కాకుంటే రేపు ఏదో ఒక కథ విపరీతంగా నచ్చేసి ఓకే చెప్పేశారనే మాట వినిపిస్తుందన్న నమ్మకంతో పవర్ స్టార్ అభిమానులు ఆశించటం అత్యాశ కాదేమో? మరి.. ఆ శుభవార్త పవన్ నోటి నుంచి ఎప్పుడు వస్తుందో..?
Please Read Disclaimer