చిట్టిబాబుది పోలీసు అవతారమట!

0‘రంగస్థలం’ విజయం తర్వాత రామ్ చరణ్ రేంజ్ రెండింతలు అయింది. స్టార్ ఇమేజ్ ముందునుంచి ఉన్నదే గానీ స్టార్ యాక్టర్ గా చరణ్ ను అందరూ గుర్తించడం మొదలుపెట్టారు. దీంతో చెర్రీ నెక్స్ట్ సినిమాపై అంచనాలు అమాంతం పెరిగాయి. అసలే బోయపాటి శ్రీను లాంటి మాస్ పల్స్ తెల్సిన స్టార్ డైరెక్టర్ తో సినిమా చేస్తుండడంతో ఈ సారి మాస్ ఆభిమానులకు పండగేనని మెగా ఫాన్స్ ఫిక్స్ అయ్యారు. కానీ సినిమాలో చరణ్ ఎలాంటి పాత్ర పోషిస్తున్నడనే విషయంలో ఇప్పటి వరకూ సమాచారం లేదు.

తాజా అప్డేట్ ప్రకారం చరణ్ ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తాడట. చరణ్ గతంలో ‘జంజీర్'(‘తూఫాన్’ తెలుగులో) అనే హిందీ సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించాడు. ఆ సినిమా ఫ్లాప్ అయింది. అప్పటి నుండి ఇప్పటి వరకూ మళ్ళీ పోలీస్ అవతారం లో కనిపించలేదు. ఇక ఈ సినిమాలో చరణ్ పోలీస్ క్యారక్టర్ ను బోయపాటి ఎలా డిజైన్ చేశాడో వేచి చూడాలి.

బోయపాటి లాస్ట్ సినిమా ‘జయ జయ నాయక’ ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేకపోయింది. మరి ఈసారి ఈ సినిమా సక్సెస్ తో అయినా తనకు మాస్ ఎంటర్టైనర్స్ ను మలచడంలో తిరుగులేదని ప్రూవ్ చేస్తాడా అనేది వేచి చూడాలి. ఈ సినిమాను సంక్రాంతి కి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు నిర్మాతలు.