పరువు నష్టానికి కారకులెవరు ఆర్జీవీ?

0

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన `అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు` ఇటీవల రిలీజైన సంగతి తెలిసిందే. సెన్సార్ అభ్యంతరాల నడుమ `కమ్మ రాజ్యంలో కడప రెడ్లు` టైటిల్ మార్చాల్సిన సన్నివేశం ఎదురైంది. కోర్టుల పరిధిలోనూ ఆర్జీవీకి వ్యతిరేక తీర్పు వెలువడడం హాట్ టాపిక్ అయ్యింది. ఇక రిలీజ్ తర్వాత ఈ సినిమాపై రకరకాల విమర్శలు ఎదురయ్యాయి. ఆర్జీవీ యథావిధిగా మరో నాశిరకం సినిమా తీశారంటూ క్రిటిక్స్ పెదవి విరిచేశారు. అయినా ఈ సినిమా థియేటర్లలో గొప్ప కలెక్షన్స్ సాధించింది అంటూ లెక్కలు చెబుతుండడం షాకిస్తోంది.

రిలీజై రిజల్ట్ కూడా తేలిపోయిన ఈ సినిమాకి ఆర్జీవీ తనదైన మార్క్ ప్రచారం చేస్తుండడం సర్వత్రా హాట్ టాపిక్ గా మారింది. ఇక ఈ సినిమాని రిలీజ్ కానివ్వకుండా అడ్డంకులు సృష్టించడం వల్ల నిర్మాతలకు తీవ్ర నష్టం వాటిల్లిందని .. తమపై కుట్రలకు పాల్పడిన వాళ్ల ఆధారాలు లభించాయని ఆర్జీవీ మీడియాకు వెల్లడించారు. 20 కోట్ల మేర పరువు నష్టం దావా వేస్తున్నానని.. అలాగే కోర్టుల పరిధిలో పోరాటం సాగిస్తానని అన్నారు. రెండు వారాల పాటు ఆలస్యంగా రిలీజ్ కావడం వల్ల తమ సినిమాకి తీవ్ర నష్టం వాటిల్లిందని ఆర్జీవీ అన్నారు. అందుకు కారకులైన వారిపై పరువు నష్టం దావా వేస్తున్నానని తెలిపారు.

ఓవైపు `అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు` రిలీజ్ ప్రచారం చేస్తూనే.. పూజా బాలేకర్ కథానాయికగా `ఎంటర్ ది గర్ల్ డ్రాగన్` అనే చిత్రానికి ఆర్జీవీ ప్రచారం చేస్తున్నారు. ఇటీవలే చైనాలో ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసిన ఆర్జీవీ ఇండియా సహా చైనాలోనూ అత్యంత భారీగా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
Please Read Disclaimer