ఫస్ట్ లుక్ వెర్షన్ 2.0: కులాల పేర్లు మారిపోయాయే!

0

వివాదాలకు శాశ్వత చిరునామాలా ఉండే రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం ‘కమ్మరాజ్యంలో కడపరెడ్లు’ టైటిల్ తో ఒక రాజకీయ మసాలా సినిమాను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. అయితే టైటిల్ లోనే కులాల ప్రస్తావన తీసుకురావడంతో వివాదాస్పదం అయింది. సెన్సార్ బోర్డు నుంచి అభ్యంతరాలు వ్యక్తం కావడంతో టైటిల్ ను ‘అమ్మరాజ్యంలో కడప బిడ్డలు’ అంటూ రైమింగ్ పీక్స్ లో ఉంటూనే అసలు టైటిల్ ను గుర్తుతెచ్చేలా మరో టైటిల్ ఫిక్స్ చేశారు.

తాజాగా ‘అమ్మరాజ్యంలో కడప బిడ్డలు’ సినిమాకు సెన్సార్ సర్టిఫికేట్ ను మంజూరు చేశారు సెన్సార్ బోర్డ్ అధికారులు. ఈ విషయం తెలుపుతూ వర్మ కొత్త టైటిల్ తో పోస్టర్లు షేర్ చేసి తనదైన శైలిలో ఒక ట్వీట్ చెణుకు విసిరాడు. “మన దేశంలో వాక్ స్వాత్రంత్రం ఉందని తెలుసుకుని థ్రిల్ అయ్యాను. కమ్మరాజ్యంలో కడపరెడ్లు సినిమాకు సెన్సార్ సర్టిఫికేట్ జారీ చేశారు. డిసెంబర్ 12 న గ్రాండ్ గా రిలీజ్ కానుంది” ఈ ట్వీట్ చేసిన పది నిముషాల్లోనే మరో ట్వీట్ లో “సారీ సారీ సారీ.. అలవాట్లో పొరపాటు. నా ఉద్దేశం అమ్మరాజ్యంలో కడపబిడ్డలు” అంటూ అసలు సంగతిని చెప్పాడు.

ఈ సందర్భంగా షేర్ చేసిన పోస్టర్లో ఆంధ్ర ప్రదేశ్ రాజకీయ యవనికపై కనిపించే అందరి పాత్రలను పోలి ఉండే నటులు ఉన్నారు. ముఖ్యంగా ‘ఫిక్షనల్’ చంద్రబాబు తరహాలో కనిపించే వ్యక్తి ఒక యోగి తరహాలో ధ్యానం చేస్తూ ఉండడం ఆసక్తిని రేపుతోంది. ఇక పవన్ కళ్యాణ్ ను పోలిన వ్యక్తి ఆలోచనలోనూ.. లోకేష్ బాబు ను పోలిన వ్యక్తి నడుస్తూ ‘వి’ అంటూ విక్టరీ సింబల్ చూపిస్తూ ఉన్నారు. వర్మగారు చెప్పిన దాన్ని బట్టి ఈ సినిమాలో ఒకే రియల్ లైఫ్ క్యారెక్టర్ కెఎ పాల్ పాత్రధారి చలాకీ చిరునవ్వుతో అదోరకమైన ఎక్స్ ప్రెషన్ ఇచ్చారు. సో.. ఆసక్తి ఉన్నవారు 12 తారీఖు టికెట్స్ బుక్ చేసుకుని ఈ ‘కమ్మరాజ్యంలో కడపరెడ్లు’ సినిమాను.. సారీ సారీ సారీ ‘అమ్మరాజ్యంలో కడపబిడ్డలు’ సినిమాను చూసేయండి.
Please Read Disclaimer