పవన్ నే క్షమించమని వేడుకున్న వర్మ

0

అందితే జుట్టు.. అందకపోతే కాళ్లు పట్టుకోవడం వర్మకు బాగా అలవాటే. గతంలో శ్రీరెడ్డిని ముందుంచి కథంతా నడిపించి ఒక దశలో పవన్ కల్యాణ్ పై మానసిక దాడికి దిగిన రామ్ గోపాల్ వర్మ అక్కడితో ఆగక పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ని బూతులు తిట్టించి ఆ తరువాత అలా తిట్టించింది తానే అని బాహాటంగా ఒప్పుకున్న విషయం తెలిసిందే. ఆ సంఘటనతో వర్మపై వున్న కాస్త గౌరవం ఆయనని అభిమానించే వాళ్లలో చచ్చిపోయింది.

అప్పటి నుంచి పవన్ కి దూరంగా వుంటూ వస్తున్న వర్మ ఇటీవల విడుదల చేసిన `అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు` సినిమాలోనూ పవన్ ని కించపరుస్తూ ఓ పాత్రని తెరపై చూపించారు. తాజాగా తను చేసిన పనికి క్షమాపణ చెబుతున్నానని వర్మ పబ్లిక్ గా చెప్పడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. వర్మ నిర్మాతగా వ్యవహరించిన చిత్రం `బ్యూటిఫుల్` జనవరి 1న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా ప్రచారాన్ని హోరెత్తిస్తూ వింత వింత చేష్టలు చేస్తున్న రామ్ గోపాల్ వర్మ మంగళవారం పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు క్షమాపణలు చెప్పడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

“ఇవాళ నా మనసులోని మాటలు చెప్పాలనుకుంటున్నా. పవన్ గారి గురించి ఓ మాట చెబుతా. ఆయనకు తిక్కుంది. నాకు లెక్కుంది కానీ లెక్క కన్నా తిక్కే అందరికి నచ్చుతుంది. అందుకే ఆయన సూపర్ స్టార్ అయ్యారు. నన్ను క్షమించండి పవన్ గారు. ప్రమాణం చేసి చెబుతున్నా. నాకు శ్రీదేవి కంటే పవన్ అంటేనే ఇష్టం. నేను దేవుణ్ణి నమ్మను. మీరు నా మాటలు నమ్మకపోతే నేనేమీ చేయలేను“ అని వర్మ చెప్పడంతో ఇదంతా సినిమా కోసం వర్మ చేస్తున్న పబ్లిసీటీ స్టంట్ లో ఒక భాగమని ఫిల్మ్ సర్కిల్స్ లో సెటైర్స్ పడుతున్నాయి.
Please Read Disclaimer