పూరీ కోసం ఆర్జీవీ..మరీ ఇంతగానా?

0

టాలీవుడ్ లో హిట్ డైరెక్టర్ గానే పేరు తెచ్చుకున్న పూరీ జగన్నాథ్… హిట్లు లేక చాలా కాలంగా బాధపడిపోతున్నాడు. తాజాగా యువ హీరో రామ్ పొతినేనితో ఆయన తీసిన ఇస్మార్ట్ శంకర్ రిలీజైంది. ఈ సినిమాపై పూరీ చాలా ఆశలే పెట్టుకున్నాడు. సినిమాకు ముందు పలు మీడియా సంస్థలతో మాట్లాడిన సందర్బంగా ఈ సినిమా తప్పకుండా హిట్ సాధిస్తుందని – తాను హిట్ కోసం ముఖం వాసిపోయానన్న కోణంలో పూరీ ఆసక్తికర కామెంట్లే చేశాడు. మరి సినిమా అయితే డివైడ్ టాక్ తోనే నడుస్తోంది. రివ్యూలలో ఏమీ లేదని చెబుతుంటే… వసూళ్లు మాత్రం హోరెత్తిపోతున్నాయి. ఇలాంటి కీలక సమయంలో తన శిష్యుడైన పూరీ కోసం సెన్సేషనల్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ రంగంలోకి దిగిపోయినట్టే ఉన్నాడు.

శనివారం ఉదయం నుంచి తనదైన శైలిలో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న వర్మ… తన ట్విట్టర్ వేదికగా ఆసక్తికర ట్వీట్లు చేస్తున్నాడు. ఓ సామాన్య ప్రేక్షకుడి అవతారం ఎత్తిన వర్మ… ఓ ఇద్దరితో కలిసి ట్రిబుల్ రైడింగ్ బైక్ మీద ఇస్మార్ట్ శంకర్ సినిమాకు వెళ్లి వచ్చిన వర్మ… సినిమా హిట్టేనంటూ సర్టిఫికెట్ ఇచ్చాడు. అంతేకాకుండా తాను ట్రిబుల్ రైడింగ్ బైక్ మీద… అది కూడా హెల్మెట్ లేని వ్యక్తి బైక్ నడుపుతూ ఉంటే తెలంగాణ పోలీసులు ఏమీ పట్టించుకోలేదంటూ సెటైర్ సంధించారు. ఈ ట్వీట్ చూసిన వెంటనే వర్మకు పోలీసులు ఫైన్ వేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే… ఇస్మార్ట్ శంకర్ సినిమాపై వర్మ తనదైన శైలిలో స్వైర విహారమే చేశారని చెప్పక తప్పదు. ఇస్మార్ట్ శంకర్ బ్లాక్ బస్టర్ హిట్టేనని – ఇలాంటి హిట్లు తీసే సత్తా ఉండి కూడా ఎందుకు దానిని వినియోగించుకోలేదంటూ పూరీని వర్మ ప్రశ్నించాడు. అంతేకాకుండా తన శిష్యుడైన పూరీని ఏరా? బాడ్ కావ్ అంటూ సంబోధిస్తూ వర్మ చేసిన ట్వీట్లు నిజంగానే తెగ వైరల్ గా మారిపోయాయి.

నిన్న రాత్రి పూరీ ఇచ్చిన హై ఫై పార్టీలో ఓ రేంజిలో ఎంజాయ్ చేసిన వర్మ… ఆ ఫోటోలను కూడా తన ట్విట్టర్ లో పోస్ట్ చేసి… ఇస్మార్ట్ శంకర్ హిట్ తో తన శిష్యుడు ఏ రేంజిలో పార్టీ చేసుకుంటున్నాడో తెలిసేలా వ్యవహరించాడు. మొత్తంగా తన శిష్యుడి చిత్రాన్ని ప్రమోట్ చేసే విషయంలో వర్మ తనదైన మార్కు పబ్లిసిటీకి తెర తీశాడని చెప్పక తప్పదు. ట్విట్టర్ వేదికగా వర్మ చేసిన ఈ రచ్చను చూసిన నెటిజన్లు… తన చిత్రాన్ని ప్రమోట్ చేసుకునే క్రమంలో పూరీనే ఇలా తన గరువు వర్మను రంగంలోకి దింపాడన్న అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా శిష్యుడి చిత్రం కోసం పూరీ చేసిన రచ్చతో సోషల్ మీడియా ఊగిపోయిందనే చెప్పాలి.
Please Read Disclaimer