వర్మ..ఈ పోస్టర్ ఆ సినిమాది కాదు కదా?

0

నాకు నచ్చినట్లు.. తోచినట్లు సినిమాలు తీస్తా. చూస్తే.. చూడు. చూడకుంటే మాను అన్నట్లుగా ఉంటుంది సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ వ్యవహారం. ఎప్పుడు సినిమాలు తీస్తాడో.. ఎప్పుడు వాటిని వదులతాడో అన్నట్లుగా ఉంటుంది. సినిమా పూర్తి అయ్యాక అదే పనిగా వార్తల్లో ఉండే ఆర్జీవీ.. ఉన్నట్లుండి కామ్ అయిపోతాడు. తన ప్రస్తావనే రానట్లుగా ఉంటాడు. ఆ టైంలో తన ఎనర్జీ మొత్తాన్ని తాను చేసే సినిమా మీదే పెడతాడు.

ఈ వారంలో విడుదలకు సిద్ధమైన కమ్మరాజ్యంలో కడప రెడ్ల సినిమాకు సంబంధించిన హీట్ రెండు తెలుగు రాష్ట్రాల్లో రగిలిస్తుంటే.. మరోవైపు కోర్టు చిక్కులు.. సెన్సార్ సమస్యల మాట వినిపిస్తోంది. ఇలాంటివేళ.. ఆ సినిమాకు సంబంధించిన వ్యవహారాన్ని పక్కన పెట్టి.. మరో ఆసక్తికర పోస్టర్ ను విడుదల చేసి హాట్ టాపిక్ గా మారారు.

ఎంటర్ ది గర్ల్ డ్రాగన్ పేరుతో సినిమాను అనౌన్స్ చేశారు వర్మ. ఈ సినిమా టైటిల్ వర్మ అభిమానించే బ్రూస్లీ ఎవర్ గ్రీన్ క్లాసిక్ ఎంటర్ ది డ్రాగన్ అనే టైటిల్ కు తనదైన శైలిలో మార్పులు చేసినట్లుగా చెప్పాలి. ఈ సినిమా తన కెరీర్ లోనే ప్రతిష్ఠాత్మక మూవీగా ఆయన పోస్టు చేశారు. తెలుగులో తొలి మార్షల్ ఆర్ట్స్ మూవీగా పేర్కొన్నాడు.

ఈ రోజు (బుధవారం) మధ్యాహ్నం 3.12 గంటలకు ఈ సినిమా టీజర్ ను విడుదల చేయనున్నట్లు చెప్పారు. దీనికి కారణం చెబుతూ.. బ్రూస్లీని అమితంగా ఇష్టపడి అమితంగాప్రేమించిన అమ్మాయి కథగా పేర్కొంటూ.. అందుకే బ్రూస్లీ గర్ల్ గా ట్యాగ్ లైన్ ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఈ సినిమాను ఇండియా చైనా సంయుక్త భాగస్వామ్యంలో నిర్మిస్తున్నారు. బ్రూస్లీ పుట్టినరోజు కానుకగా ఈ రోజు టీజర్ ను విడుదల చేస్తున్నట్లు చెప్పారు. దీనికి ముందుగా పోస్టర్ ను విడుదల చేసి బజ్ క్రియేట్ చేశారు.

ఇదంతా బాగానే ఉందికానీ.. ఈ పోస్టర్ ను చూసినంతనే అప్పట్లో వర్మ బ్రూస్లీ పేరుతో ఒక సినిమా అనౌన్స్ చేసి.. టీజర్ కూడా విడుదల చేశారు. ఇప్పుడు అదే సినిమాను పేరు మార్చి రిలీజ్ చేస్తున్నారా? అన్న అనుమానాన్ని కొందరు వ్యక్తం చేస్తుంటే.. మరికొందరు కొట్టి పారేస్తున్నారు. ఈ చిత్ర అంతర్జాతీయ ట్రైలర్ ను బ్రూస్లీ సొంత పట్టణమైన చైనాలోని పోషన్ సిటీలో డిసెంబరు 13న విడుదల చేయనున్నారు. మరీ.. సినిమాలో వర్మ తన సత్తా ఎంతమేర చాటుతారో చూడాలి.




Please Read Disclaimer