వర్మ U టర్నుకు కారణం భయమేనా?

0

సినిమాలు ప్రకటించడం.. అవి అటకెక్కడం ఫిలిం ఇండస్ట్రీలో సాధారణంగా జరిగే వ్యవహారమే. వెయ్యి కోట్లతో ‘మహాభారతం’ అన్నారు. ఏమైందో అందరికీ తెలుసు. ఇక బాహుబలి స్థాయిలో రామ్ గోపాల్ వర్మ గతంలో ‘న్యూక్లియర్’ అనే సినిమాను ప్రకటించాడు. ఇప్పుడు ఆ సినిమా సంగతి ఆర్జీవీకి అయినా గుర్తు ఉందో లేదో. ఇక వర్మ కెరీర్ లో ప్రకటించిన తర్వాత పట్టాలెక్కని.. రిలీజ్ కాని సినిమాలు చాలానే ఉన్నాయి. ఇవన్నీ ఒక ఎత్తు.. మెగా ఫ్యామిలీ మరో ఎత్తు.

ఒక సినిమాను ప్రకటించి 24 గంటల్లోపల దాన్ని క్యాన్సిల్ చేయడం ప్రపంచంలో మొదటిసారి జరిగి ఉండొచ్చేమో. నిన్న రాత్రి.. అంటే మందుబాబులు మత్తులో జోగుతూ ఉండే వేళ వర్మ నుంచి ఒక ఆటం బాంబు లాంటి ప్రకటన వచ్చింది. “కమ్మరాజ్యంలో కడప రెడ్లు తర్వాత నేను చేయబోయే సినిమా మెగా ఫ్యామిలీ” అనేది ఆ ట్వీట్ సారాంశం. ఒక్కసారిగా వర్మ ట్వీట్ల వీరాభిమానులతో పాటుగా టోటల్ టాలీవుడ్ ఉలిక్కిపడింది. మెగా ఫ్యామిలీని గిల్లడం గిచ్చడం ఆర్జీవికి మొదటి నుంచి అలవాటే. కారణాలు ఏవైనా మెగా ఫ్యామిలీని ప్రతి విషయంలోకి లాగి ఆటపట్టిస్తూ ఉంటాడు. మెగా ఫ్యాన్స్ తీవ్రంగా ఆర్జీవీపై తిట్లవర్షం కురిపిస్తూ ఉంటారు. అయితే అవన్నీ వేరు ఇది వేరు.

మెగా ఫ్యామిలీ సినిమా ప్రకటన రాగానే మెగా ఫ్యాన్స్ మండిపడ్డారు. యాంటిఫ్యాన్స్ పండగ చేసుకున్నారు. అయితే ‘సినిమా తీయలేక మంగళవారం’ అన్నట్టుగా ఏదో ఒక సాకు చెప్పి నేను మెగా ఫ్యామిలీ సినిమా చేయడం లేదని వర్మ తుస్సుమనించాడు. దీంతో మెగా ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. అయితే నెటిజన్లు అందరూ ఊరుకోరు కదా. అర్జీవీ భయపడ్డాడని కొందరు.. మెగా ఫ్యామిలీ ప్రెజర్ కు తలొగ్గి ఈ సినిమా మానుకున్నాడని కొందరు కామెంట్లు చేయడం మొదలుపెట్టారు. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ లాంటి కొన్ని సినిమాలు భయపడకుండా తీసినప్పటికీ ఆర్జీవి కొన్ని సినిమాల విషయంలో వెనకడుగు వేసిన సంగతి గుర్తు చేస్తూ ఆర్జీవి కూడా భయస్తుడేనని అంటున్నారు.

నయీం.. రెడ్డిగారు పోయారు.. టైగర్ కేసిఆర్ లాంటి చాలా సినిమాలు పక్కన పెట్టడంలో వర్మ భయపడడమే కారణమా ని గుర్తు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ విషయంలో గతంలో వర్మ చేసిన హంగామా ఆర్జీవి ఇమేజిని పూర్తిగా దెబ్బతీసిందని.. అందుకే తన ఆలోచనను విరమించుకున్నాడని కూడా కొందరు అభిప్రాయపడ్డారు. వోడ్కా ప్రభావంలో సినిమా ప్రకటన చేశాడని.. తెల్లారగానే మనసు స్వాధీనంలోకి రావడంతో తూచ్ అన్నాడని కూడా కొందరు సరదాగా కామెంట్ చేశారు. ఏదేమైనా ఆర్జీవీ U-టర్న్ మాత్రం ఇండస్ట్రీలో.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.