ఆర్జీవీ మకతిక తికమక పేరడీ టైటిల్!

0

ఇన్నాళ్లు పేరడీ పాటలు విన్నాం. పేరడీ సీన్లు చూశాం. కామెడీలు పేరడీల్లో అల్లేస్తున్న ట్యాలెంటును .. చివరికి న్యూస్ చానెళ్లలో పేరడీ వేషాల్ని చూస్తూనే ఉన్నాం. అయితే వీటన్నిటినీ మించిన సరికొత్త పేరడీ ఆలోచనను .. రికార్డ్ బ్రేకింగ్ పేరడీ ఐడియాను ఎవరైనా చెప్పగలరా? అంటే.. అబ్బే.. ఎవరి వల్లా కాదని అంటారా?

అయితే అలాంటి ఐడియా ఒకరికి మాత్రం చాలా ఈజీ. ఎవరాయన? అంటే ఆతడే ఆర్జీవీ. వివాదాల రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న కుల హత్యా రాజకీయాల సెటైరికల్ మూవీ `కమ్మ రాజ్యంలో కడప రెడ్లు` పై ఓ వర్గం కక్ష కట్టిందని వార్తలొస్తున్నాయి. ఇప్పటికే కులాలపై తీస్తున్న ఈ సినిమాని రిలీజ్ కానివ్వమని పలువురు గొడవలు రెచ్చగొడుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి వేళ సెన్సార్ గడపపై చిక్కులు తప్పేట్లు లేవు.

ఒకవేళ టైటిల్ మార్చాలని సెన్సార్ బోర్డ్ ఆర్డర్ వేస్తే ఆర్జీవీ ఏం చేస్తాడు? ఇదే ప్రశ్న ఆయన్నే అడిగేస్తే ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. ఇప్పటికే ఆల్టర్నేట్ టైటిల్ ని రెడీ చేసి పెట్టాను. అది పేరడీ టైటిల్ అంటూ చెప్పుకొచ్చాడు. ఇంతకీ ఏదా టైటిల్ ? అంటే.. మక్క రాజ్యంలో డకప రెడ్లు! అనే పేరడీ టైటిల్ ని సిద్ధం చేసి పెట్టానని తెలిపాడు. మొత్తానికి ఆర్జీవీ ఐడియా చూస్తుంటే టైటిళ్లను కూడా ఇలా పేరడీలు చేయొచ్చా.. అబ్బచ్చా! అని తెగ నవ్వేసుకుంటున్నారు జనం. తనకు తోచింది చేయడం.. తనకు తోచినట్టు టైటిల్స్ పెట్టుకోవడం కూడా ఆర్జీవీకే చెల్లుతుందేమో. తికమక మక తిక టైపు ఆర్జీవీ ఏం చేసినా ఇలా కొత్తగా వింతగా ఏదోలా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మక తిక తికమక ఆర్జీవీ!!
Please Read Disclaimer