రాములో రాముల.. రచ్చ రచ్చ

0

అల్లు అర్జున్ కలెక్షన్స్ విషయంలో ఏమో కాని యూట్యూబ్ లో మాత్రం సూపర్ స్టార్ అంటూ మనం ఇటీవలే చెప్పుకున్నాం. అల వైకుంఠపురంలో చిత్రం మొదటి పాట సామజవరగమన రికార్డు స్థాయి వ్యూస్ తో పాటు.. యూట్యూబ్ లైక్స్ ను సొంతం చేసుకుంది. ఇప్పుడు అల వైకుంఠపురంలోని రెండవ పాట రాములో రాముల పాట ప్రోమో సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. దీపావళికి ఈ పాటను విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటిస్తూ ప్రోమోను విడుదల చేశారు. నిన్న సాయంత్రం విడుదల చేసిన ఈ ప్రోమోకు బన్నీ గత వీడియోల మాదిరిగానే యూట్యూబ్ లో రికార్డు స్థాయిలో వ్యూస్ వస్తున్నాయి.

24 గంటల్లో ఈ రాములో రాముల పాట ప్రోమో ఏకంగా 4.3 మిలియన్ ల వ్యూస్ ను సొంతం చేసుకుంది. 1.5 లక్షల యూట్యూబ్ లైక్స్ ను ఈ పాట ప్రోమో దక్కించుకుంది. యూట్యూబ్ లో అల్లు అర్జున్ తోపు అంటూ మరోసారి నిరూపితం అయ్యింది అంటూ అల్లు అర్జున్ ఫ్యాన్స్ తెగ సంబర పడిపోతూ రికార్డులను లెక్కలు వేసుకుంటున్నారు. మొదటి 51 నిమిషాల్లో 50 వేల లైక్స్.. 3 గంటల 21 నిమిషాల్లో లక్ష లైక్స్ అంటూ బన్నీ ఫ్యాన్స్ తెగ హడావుడి చేస్తున్నారు.

త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. సినిమా విడుదలకు మూడు నెలలకు పైగా ఉండగానే సామజవరగమన పాట విడుదల చేశాడు. ఇప్పుడు రాములో రాముల పాటతో రెడీ అయ్యాడు. పాట ప్రమోనే రచ్చ చేస్తే ఇక పాట ఎలా ఉంటుందో అంటూ బన్నీ ఫ్యాన్స్ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ‘అల వైకుంఠపురంలో’ చిత్రం బన్నీ కెరీర్ లో నిలిచి పోతుందనే నమ్మకంను మెగా ఫ్యాన్స్ వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ చిత్రం మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు నుండి గట్టి పోటీ ఎదుర్కోబోతుంది.
Please Read Disclaimer