రమ్యకృష్ణతో మ్యాడీ.. పెయిర్ ఓకేనా?

0

వెండితెర `పేరెంట్` అంటే ఓ బ్రాండ్ ఉండాలి. టాలీవుడ్ లో మహా అయితే ఓ మూడు నాలుగు జంటల గురించి ప్రముఖంగా ముచ్చటించుకుంటారు. ప్రకాష్ రాజ్ – జయసుధ.. రాజేంద్ర ప్రసాద్- ఆమని .. సీనియర్ నరేష్ – ఆమని… బ్రహ్మానందం- హేమ ఇలా కొందరిని గుర్తు చేసుకుంటాం. ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ పెయిర్ పేర్లు తెరపైకొచ్చాయి.

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కథానాయకుడిగా నటించనున్న తదుపరి చిత్రానికి మమ్మీ డాడీల్ని సెట్ చేసే పనిలో ఉన్నారట. తల్లి పాత్రలో సీనియర్ నటి రమ్య కృష్ణ నటించనున్నారని.. అలాగే మ్యాడీ అలియాస్ ఆర్.మాధవన్ తండ్రి పాత్రలో నటించబోతున్నారని ప్రచారమవుతోంది.

వరుణ్ తేజ్ నటిస్తున్న 10వ సినిమా ఇది. బాక్సింగ్ నేపథ్యంలో యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనుంది. కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహించనున్నారు. ఇటీవలే సినిమా ప్రారంభమైంది. ఇప్పటికే ఈ చిత్రంలో నటించేందుకు రమ్యకృష్ణ అంగీకరించారని చెబుతున్నా.. మాధవన్ ఫైనల్ అయ్యారా లేదా? అన్నది తెలియాల్సి ఉంది. అధికారికంగా టీమ్ కన్ఫామ్ చేయాల్సి ఉంది.

మరోవైపు మాధవన్ – రమ్యకృష్ణ పెయిర్ అంటే మోస్ట్ పవర్ ఫుల్ గా ఉంటుందని భావిస్తున్నారు. నీలాంబరి.. శివగామి వంటి పాత్రల్లో పవర్ ప్యాక్డ్ పెర్ఫామెన్సులతో మెప్పించారు సీనియర్ నటి రమ్యకృష్ణ. అలాగే కెరీర్ లో ఎన్నో ఎమోషనల్ క్యారెక్టర్లతో మైమరిపించారు మాధవన్. అందుకే ఈ జోడీకి క్రేజు నెలకొంది. ఆకాశ్ పూరి చిత్రం రొమాంటిక్.. కృష్ణవంశీ దర్శకత్వం వహించనున్న రంగ మార్తాండ చిత్రాలకు రమ్యకృష్ణ సంతకం చేశారని ఇటీవల వార్తలొచ్చిన సంగతి తెలిసిందే.
Please Read Disclaimer