ఆకలేస్తే రష్మిక కుక్క బిస్కెట్లు తింటుంది: సీక్రెట్ చెప్పేసిన నితిన్

0

‘‘సాధారణంగా ఆకలేస్తే ఎవరైనా ఉప్మానో, ఇడ్లీనో, స్వీటో, చిప్సో తింటారు. కానీ, రష్మిక ఏం తింటుందో తెలుసా.. కుక్క బిస్కెట్లు’’ అని టాప్ సీక్రెట్ చెప్పేశారు నితిన్. వీరిద్దరు హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం ‘భీష్మ’. వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగ వంశి నిర్మిస్తున్నారు. ఈనెల 21న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్లలో భాగంగా నితిన్, రష్మిక వాలంటైన్స్ డే స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో యాంకర్ అడిగిన ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు చెప్పారు.

పెళ్లి గురించి టాప్ సీక్రెట్ చెప్పిన నితిన్

వాలంటైన్స్ డే స్పెషల్ అంటూ ఏమీ లేదని.. కాకపోతే ఈ ఏడాదిలో తన పెళ్లి కాబోతోందని అన్నారు. ‘‘పెళ్లి కుదిరాక ఫస్ట్ వాలంటైన్స్ డే కదా’’ అని రష్మిక అడగగానే.. ‘‘మీ అందరికీ తెలిసి ఇది ఫస్ట్ వాలంటైన్స్ డే, నాకు ఆ అమ్మాయి ఎప్పటి నుంచో తెలుసు. గత ఏడు ఎనిమిది ఏళ్లుగా మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం. కాబట్టి ఎన్నో వాలంటైన్స్ డేలు గడిచాయి’’ అని టాప్ సీక్రెట్ చెప్పేశారు నితిన్. తనది అరేంజ్‌డ్ మ్యారేజ్ కాదని లవ్ మ్యారేజ్ అని చెప్పారు. పెద్దలను ఒప్పించి పెళ్లిచేసుకుంటున్నామని స్పష్టం చేశారు.

నితిన్ క్రష్ వెయ్యి పైనే..

సింగిల్ యాంథమ్‌లో ‘‘హై క్లాస్ నుంచి లో క్లాస్ దాకా నా క్రష్‌లే వందల్లో ఉన్నారులే’’ అనే లైన్‌ గుర్తుచేసి ‘‘మీ క్రషెస్ ఎవరున్నారు? 100 దాటేసిందా?’’ అని నితిన్‌ను యాంకర్ అడిగారు. దీనికి నితిన్.. ‘‘వందేంటి ఈజీగా వెయ్యి దాటిపో ఉంటుంది. క్రష్షే కదా.. ఒక అమ్మాయి వెళ్తుంటే భలే ఉందే అంటాం. అదే క్రష్. అలాంటివి నా లైఫ్‌లో వెయ్యికి పైగా ఉంటాయి’’ అని అస్సలు తడుముకోకుండా సమాధానం ఇచ్చారు.

మనకంత సీన్ లేదు..

ఇదే క్రష్ గురించి రష్మికను నితిన్ అడిగారు. కాస్త సిగ్గుపడిన రష్మిక.. ‘‘మనకంత సీన్ లేదు’’ అన్నారు. వెంటనే అందకున్న నితిన్.. ‘‘నిజానికి నీలోనే ఒక ప్రాబ్లమ్ ఉంది. నీకు అమ్మాయిలంటే ఇష్టమా? అబ్బాయిలంటే ఇష్టం లేదంటున్నావు కదా. పర్వాలేదు.. ఇప్పుడు ఇదంతా లీగల్. ఓపెన్ అయిపో’’ అంటూ ఆటపట్టించారు. తాను సెలక్టివ్‌గా ఉంటానని.. క్రష్ అనిపించేంతలా ఎవ్వరూ తనకు తగల్లేదని రష్మిక అన్నారు. అయితే, తమిళ స్టార్ దళపతి విజయ్ అంటే క్రష్ ఉండేదని చెప్పారు.

‘భీష్మ’లో మరో కోణం..

సాధారణంగా ‘భీష్మ’ పాటలు, టీజర్ చూసి ఇదొక లవ్ స్టోరీ అని అంతా అనుకుంటారని కానీ దీనిలో మరో కథ మిళితమై ఉందని నితిన్, రష్మిక చెప్పుకొచ్చారు. సేంద్రియ వ్యవసాయం (ఆర్గానిక్ ఫార్మింగ్) ఈ సినిమాలో ప్రధాన అంశమని చెప్పారు. తాను మీమ్స్ క్రియేటర్‌ పాత్ర పోషించానని నితిన్ చెప్పారు. తన పాత్రతో కామెడీ బాగా పండిందని వెల్లడించారు. ‘దిల్’ తరవాత మళ్లీ ఆ స్థాయి సినిమా చేసిన ఫీలింగ్ ‘భీష్మ’ విషయంలో కలిగిందని నితిన్ చెప్పారు.

ఎవ్వరికీ తెలియని టాప్ సీక్రెట్

‘‘మీ ఇద్దరికీ మాత్రమే తెలిసి వేరేవాళ్లకు తెలియని ఒక సీక్రెట్ గురించి చెప్పండి’’ అని యాంకర్ నితిన్, రష్మికలను అడిగారు. ఈ ప్రశ్నకు కూడా రష్మిక చాలా సేపు ఆలోచించారు. అయితే, నితిన్ నేను చెప్తా అంటూ అందుకున్నారు. ‘‘సాధారణంగా సాయంత్రం ఆకలేస్తే మీరు ఏం తింటారు? ఉప్మా, ఇడ్లీ, స్వీట్, డిజర్ట్, చిప్స్ ఏవో ఒకటి తింటారు. ఈమె ఏం తింటుందో తెలుసా? కుక్క బిస్కెట్లు తింటుంది’’ అని టాప్ సీక్రెట్ చెప్పేశారు నితిన్. దీనికి రష్మిక వివరణ ఇచ్చుకున్నారు. తన దగ్గర ఒక పప్పీ ఉండేదని.. దానికి పెట్టే పెడిగ్రీ టేస్ట్ చేయాలనిపించి ఒకసారి తిని చూశానని అన్నారు. మొత్తం మీద ఈ ఇంటర్వ్యూ అంతా చాలా సరదాగా ఇలాంటి చిలిపి ప్రశ్నలు, సమాధానాలతో సాగింది.
Please Read Disclaimer