స్టార్స్ విషయంలో ‘ఆర్ ఆర్ ఆర్’ కు పోటీగా ‘కేజీఎఫ్ 2’

0

గతంలో సౌత్ సినిమాలన్నా.. సౌత్ సినిమాల్లో నటించే వాళ్లన్నా కూడా బాలీవుడ్ వారికి చిన్న చూపు ఉండేది. కాని ప్రస్తుతం బాలీవుడ్ వారు సైతం సౌత్ సినిమాల్లో నటించాలని పరితపించేలా మన వాళ్లు చేశారు. శంకర్.. రాజమౌళి – మణిరత్నం – మురుగదాస్ ల తర్వాత ఇప్పుడు ప్రశాంత్ నీల్ కూడా బాలీవుడ్ వారు సౌత్ లో నటించేందుకు ఆసక్తి చూపించేలా చేశాడు. కేజీఎఫ్ చిత్రంతో ప్రశాంత్ నీల్ ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించాడు.

కేజీఎఫ్ చిత్రంకు ప్రస్తుతం సీక్వెల్ ను ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంను పాన్ ఇండియా లెవల్ లో విడుదల చేసేందుకు మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే పలువురు బాలీవుడ్ ప్రముఖులను ఈ చిత్రంలో నటింపజేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే సంజయ్ దత్ ను అధీరా పాత్రకు తీసుకున్న ప్రశాంత్ నీల్ ఇప్పుడు మరో బాలీవుడ్ స్టార్ రవీనా టాండన్ ను కూడా కేజీఎఫ్ 2 లో భాగస్వామిని చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.

ఇటీవల రవీనాను కలిసిన ప్రశాంత్ నీల్ ఆమెను ఒక పాత్ర కోసం సంప్రదించాడట. కేజీఎఫ్ సినిమాకు ఉన్న క్రేజ్ కారణంగా వెంటనే నటించేందుకు ఒప్పుకుంది. కేజీఎఫ్ 2 చిత్రం స్టార్ కాస్ట్ విషయంలో ఆర్ ఆర్ ఆర్ చిత్రంతో పోటీ పడుతున్నట్లుగా అనిపిస్తుంది. ఆర్ ఆర్ ఆర్ చిత్రం కోసం ఆలియా భట్.. అజయ్ దేవగన్ లతో పాటు పలువురు బాలీవుడ్ స్టార్స్ ను జక్కన్న తన చిత్రంలో నటింపజేసి బాలీవుడ్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్నాడు. అందుకే జక్కన్నకు పోటీ అన్నట్లుగా కేజీఎఫ్ 2 లో కూడా భారీ స్టార్ కాస్టింగ్ ను ప్రశాంత్ నీల్ ప్లాన్ చేస్తున్నాడు.

కేజీఎఫ్ 2 చిత్రం ఆర్ ఆర్ ఆర్ చిత్రం ఖాళీ చేసిన జులై 30 – 2020వ తేదీన వచ్చే అవకాశం ఉంది అంటూ ప్రచారం జరుగుతుంది. దాదాపుగా 200 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.