కాస్త స్లో గురూ.. మళ్లీ ఆ స్పీడ్ ఎందుకు?

0

ఈమద్య కాలంలో స్టార్ హీరోలు సంవత్సరంలో ఒక్క సినిమాను విడుదల చేయడమే గగణం అయ్యింది. కొందరు హీరోలు అయితే ఏడాదిలో కనీసం ఒక్క సినిమాను కూడా విడుదల చేయలేక పోతున్నారు. అలాంటిది కొన్నాళ్ల క్రితం వరకు మాస్ రాజా రవితేజ ఏడాదికి మూడు నాలుగు సినిమాలు చేసిన సందర్బాలు కూడా ఉన్నాయి. సినిమా సక్సెస్ ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుసగా రవితేజ సినిమాలు చేస్తూ వెళ్లే వాడు. ఆ సమయంలో రవితేజ ఫ్లాప్ ల శాతం మరీ ఎక్కువ అయ్యింది. దాంతో కాస్త జోరు తగ్గించాడు.

రవితేజ ఏడాదికి ఒకటి రెండు సినిమాలు చేస్తూ స్లో అండ్ స్టడీగా వెళ్లాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. ఎన్ని ఎక్కువ ఫ్లాప్ లు పడితే అంత త్వరగా కెరీర్ కిల్ అవుతుందని విశ్లేషకులు అంటూ ఉంటారు. అందుకే ఏ హీరో అయినా తక్కువ సినిమాలు చేస్తూ ఫ్లాప్ ల రేటు తక్కువ ఉండేలా చూసుకుంటున్నారు. అలాగే రవితేజ కూడా ఉండాలని ఆయన శ్రేయోభిలాషులు కోరుకుంటున్నారు. కాని రవితేజ మళ్లీ కాస్త స్పీడ్ పెంచడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

ప్రస్తుతం డిస్కోరాజా చేస్తున్న రవితేజ ఆ సినిమా విడుదల కాకుండానే గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక సినిమాకు కమిట్ అయ్యాడు. శృతి హాసన్ హీరోయిన్ గా నటించబోతున్న ఆ సినిమాను అతి త్వరలోనే సెట్స్ పైకి తీసుకు వెళ్లబోతున్నారట. రెండు సినిమాలు చేతిలో ఉండగానే మరో సినిమా విషయంలో కూడా రవితేజ చర్చలు జరుపుతున్నాడట.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో రవితేజ ఒక సినిమాను చేయబోతున్నాడట. మాస్ ఎంటర్ టైనర్స్ ను తెరకెక్కించగల దర్శకుడు త్రినాధరావు. సినిమా చూపిస్తమావ మరియు నేను లోకల్ వంటి విభిన్నమైన సినిమాలు చేసిన త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో రవితేజ సినిమా చేయబోతున్నాడట. అల్లు అరవింద్ ఈ సినిమాను నిర్మిస్తాడని కూడా టాక్ వినిపిస్తుంది.

గోపీచంద్ మలినేని సినిమా పూర్తి అయిన తర్వాత దీన్ని ప్రారంభించడం మంచిదని.. హడావుడిగా సినిమాలు చేస్తే మళ్లీ మునుపటి ఫలితాలు వస్తాయేమో అంటూ అభిమానులు ఆందోళన చెందుతూ సోషల్ మీడియా ద్వారా రవితేజకు స్పీడ్ వద్దు బాసూ అంటూ సలహాలు ఇస్తున్నారు. మరి రవితేజ మాత్రం ఇప్పటి వరకు త్రినాధరావు నక్కినతో మూవీ విషయంలో ఎలాంటి అధికారిక ప్రకటన అయితే చేయలేదు. కనుక ఆ సినిమా ఉందో లేదో క్లారిటీ రావాల్సి ఉంది.
Please Read Disclaimer