చిరుతో భేటీ జగన్ వ్యూహం ఇదేనా?

0

ఆట చాలామంది ఆడతారు. కానీ.. కొందరు ఆడే ఆట కళాత్మంగా ఉంటుంది. రాజకీయాలు చేసేటోళ్లు తెలుగు నేల మీద అడుగుకు ఒకరు చొప్పున కనిపిస్తారు. రాజకీయాల మీద అవగాహన కూడా తక్కువేం కాదు.. తక్కువ అనుకుంటే ఇంటికి ఇద్దరు రాజకీయాల మీద అవగాహన ఉంటుంది. అంతటి అవగాహన ఉన్న ప్రజల మధ్య రాజకీయం చేయటం.. అది కూడా సొగసుగా చేయటం అంత తేలికైనా విషయం కాదు. కూల్ గా.. సెటిల్డ్ గా రాజకీయం చేస్తూ.. బలమైన పునాదులు వేసేలా జగన్ పాలన ఉందని చెప్పాలి.

ఇటీవల కాలంలో ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు.. విపక్షం తనను బద్నాం చేసేందుకు చేస్తున్న ప్రయత్నాల్ని ఒక పక్కన చెక్ చెబుతూనే.. మరోవైపు రాజకీయంగా ఆయన కదుపుతున్న పావులు చూస్తే.. జగన్ లో పరిపక్వత కలిసిన రాజకీయ నేత కనిపిస్తాడు. తాజాగా మెగాస్టార్ చిరంజీవితో ముఖ్యమంత్రి జగన్ భేటీపై సర్వత్రా ఆసక్తి వ్యక్తమైంది. ఈ భేటీలో చర్చించిన అంశాలు బయటకు పెద్దగా రానప్పటికీ.. ఈ ఇద్దరు ప్రముఖుల మధ్య జరిగిన సమావేశం రానున్న రోజుల్లో రాష్ట్రానికి మరింత మంచి జరుగుతుందన్న మాట వినిపిస్తోంది.

చిరుతో భేటీతో జగన్ గేమ్ ప్లాన్ మామూలుగా లేదన్న మాట వినిపిస్తోంది. ముందుచూపు.. అంతకు మించిన వ్యూహం తాజా భేటీ వెనుక ఉన్నట్లు చెబుతున్నారు. చిరుతో భేటీ ద్వారా ఏపీలోని ఒక బలమైన సామాజిక వర్గానికి తమ ప్రభుత్వం సన్నిహితంగా ఉందన్న భావనను కలుగజేశారు. చిరంజీవితో తన భేటీకి సంబందించిన బాధ్యతలు..పనుల్ని తన మంత్రివర్గంలో మంత్రి అయిన కన్నబాబుకు అప్పజెప్పటం ద్వారా ఇవ్వాల్సిన సంకేతాల్ని ఇచ్చినట్లుగా చెప్పాలి.

ఏపీలో బలమైన సామాజిక వర్గంతో పాటు.. ఓటుబ్యాంకు కలిగిన కాపు సామాజిక వర్గానికి తమ ప్రభుత్వం స్నేహంగా ఉందని.. అదే సామాజిక వర్గానికి చెందిన మెగాస్టార్ తో తమ ప్రభుత్వానికి చక్కటి సంబంధాలు ఉన్నట్లుగా తాజా విందు భేటీ స్పష్టం చేసిందని చెప్పాలి. ముద్రగడ లాంటి ఉద్యమనేతల కంటే కూడా సున్నితంగా ఉంటూ.. అనవసరమైన వివాదాలకు జోలికి వెళ్లని చిరుతో రిలేషన్ పార్టీకి మంచిదన్న ఆలోచనలో జగన్ ఉన్నట్లు తెలుస్తోంది.

ఇదే సమయంలో చిరుకు కూడా వైఎస్ జగన్ తో చక్కటి సంబంధాలు ఉన్నాయన్న సంకేతాలు.. టాలీవుడ్ లో కొన్ని సమీకరణాల్ని సెట్ చేసేందుకు సాయం చేస్తుందని చెబుతున్నారు. ఎవరు అవునన్నా.. కాదన్నా.. స్వయంప్రతిభతో ఎదిగిన చిరును సైతం దెబ్బ తీయటానికి సినీ రంగానికి చెందిన ఎన్నో బలమైన లాబీలు విపరీతంగా ప్రయత్నిస్తున్న వేళ.. బలమైన జగన్ అండ మెగా కాంపౌండ్ కు చాలా అవసరం అంటున్నారు.

మెగా ఫ్యామిలీతో జగన్ భేటీపై కొందరు లేనిపోని రార్దాంతం చేసినా.. భవిష్యత్తు అవసరాల కోణంలో చూసినప్పుడు.. అందరిని కలుపుకుపోయేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారన్న సంకేతాన్ని తాజా భేటీతో ఏపీ ముఖ్యమంత్రి ఇచ్చారని చెప్పాలి. ఏమైనా.. తాత్కాలిక ప్రయోజనం కంటే కూడా.. సుదీర్ఘకాలంలో తమ ప్రభుత్వం చాలానే చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లుగా తన తీరుతో జగన్ స్పష్టం చేస్తున్నారని చెప్పక తప్పదు.
Please Read Disclaimer