RED సిగ్నల్ ఇచ్చిన ఇస్మార్ట్ రామ్

0

ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో గ్రేట్ కంబ్యాక్ చూపించాడు ఎనర్జిటిక్ రామ్. శంకర్ యాటిట్యూడ్ రామ్ యాటిట్యూడ్ ఒకటే అంటూ పొగిడేశారంతా. పూరి ఇచ్చిన మాస్ హిట్ తో అతడి కెరీర్ కి తిరిగి జవసత్వాలు వచ్చాయి. ప్రస్తుతం ఇదే జోష్ లో అదిరిపోయే మాస్ ఎంటర్ టైనర్లకు రామ్ రెడీ అవుతున్నాడు. తాజాగా RED అనే మాసివ్ చిత్రంలో నటిస్తున్నానని పోస్టర్ ని సామాజిక మాధ్యమాల్లో రిలీజ్ చేశాడు రామ్.

నేను శైలజ లాంటి బ్లాక్ బస్టర్ ని కెరీర్ కి అందించిన కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. స్రవంతి మూవీస్ పతాకంపై పెదనాన్న స్రవంతి రవికిషోర్ నిర్మించనున్నారు. తాజాగా ఈ చిత్రం టైటిల్ తోపాటు హీరో రామ్ ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు. రామ్ లుక్ సంథింగ్ హాట్ అనే చెప్పాలి. మునుపటితో పోలిస్తే చాక్లెట్ బోయ్ లా కాకుండా పూర్తి రఫ్ అండ్ ఠఫ్ గా కనిపిస్తున్నాడు. షార్ట్ హెయిర్ .. గుబురు గడ్డం.. భృకుటి ముడి .. ఈ వ్యవహారం చూస్తుంటే పాత ఇమేజ్ కి టాటా చెప్పేసి కొత్త ఇమేజ్ కోసం మాస్ అప్పీల్ కోసం రామ్ తాపత్రాయ పడుతున్నాడని అర్థమవుతోంది. రామ్ నటిస్తున్న 18వ చిత్రమిది. కెరీర్ లో డిఫరెంట్ మూవీ అని చెబుతున్నాడు. డార్క్ బ్లూ బ్యాక్ గ్రౌండ్ పై రెడ్ అనే అక్షరాలు పోస్టర్ లో హైలైట్ గా కనిపిస్తున్నాయి. అయితే ఫ్యామిలీ ఎమోషన్స్ తో లవ్ ఫీల్ తో సినిమాలు తీసే దర్శకుడిగా కిషోర్ కి పేరుంది. మరి ఈసారి అతడు కూడా బాణీ మార్చి మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ తెరకెక్కిస్తున్నాడా? అన్నది చూడాలి.

నేను శైలజ-ఉన్నది ఒకటే జిందగీ తర్వాత రామ్ – తిరుమల కాంబినేషన్లో మళ్లీ సినిమా తీస్తున్నారు స్రవంతి. మణిశర్మ తొలిసారి ఈ బ్యానర్ లో పని చేస్తున్నారు. నవంబర్ 16 నుంచి చిత్రీకరణ మొదలవుతుంది. ఇతర తారాగణం వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు. సమీర్ రెడ్డి ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. పీటర్ హెయిన్స్ ఫైట్స్ అందిస్తున్నారు.