పెళ్ళిచూపులు భామకు సూపర్ ఛాన్స్

0

విజయ్ దేవరకొండ ఫస్ట్ సోలో హిట్ ‘పెళ్ళిచూపులు’ తో మంచి గుర్తింపు సాధించిన భామ రీతు వర్మ. ఆ సినిమాకు ముందు కూడా రీతు ఓ నాలుగు సినిమాలలో నటించింది కానీ ‘పెళ్ళి చూపులు’ తర్వాతే రీతు పేరు అందరికీ తెలిసింది. అయితే ఎందుకో కానీ టాలీవుడ్ లో రీతుకు పెద్దగా అవకాశాలు రాలేదు. ఆ సినిమా తర్వాత నిఖిల్ ‘కేశవ’ లో హీరోయిన్ గా నటించింది. తర్వాత కోలీవుడ్ కు షిఫ్ట్ అయింది. తాజా సమాచారం ప్రకారం ఈ భామను యువహీరో నాగశౌర్య కొత్త సినిమాలో హీరోయిన్ గా పరిశీలిస్తున్నారట.

నాగశౌర్య ప్రస్తుతం పలు సినిమాలను లైన్ లో పెట్టాడు. వాటిలో ఒకటి సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో తెరకెక్కనుంది. సుమంత్ తో ‘సుబ్రహ్మణ్యపురం’ సినిమాను తెరకెక్కించిన దర్శకుడే ఈ సంతోష్. ఈ సినిమాలోనే నాగశౌర్యకు జోడీగా రీతువర్మను తీసుకుంటున్నారని.. ఇప్పటికే చర్చలు జరిగాయని.. దాదాపుగా రీతు హీరోయిన్ ఫిక్స్ అయినట్టేనని సమాచారం. ఈ సినిమా ఫిక్స్ అయితే రీతుకు మళ్ళీ టాలీవుడ్ లో తన సత్తా చాటే అవకాశం మరోసారి లభించినట్టే. సినిమా హిట్ అయితే ఆటోమేటిక్ గా కొత్త అవకాశాలు వస్తాయి.

ప్రస్తుతం ఈ భామ చేతిలో ‘కణ్ణుమ్ కణ్ణుమ్ కొళ్లైదిత్తాల్’ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఒక తమిళ సినిమా ఉంది. ఈ సినిమా కాకుండా విక్రమ్ తో నటించిన గౌతమ్ వాసుదేవన్ చిత్రం ‘ధృవ నక్షత్రం’ కూడా రిలీజ్ కాకుండా పెండింగ్ లో ఉంది.
Please Read Disclaimer