ఆర్టీవీ మరో బాంబు.. లోకేష్ కు పవన్ ఓదార్పు

0

లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాతో ఇప్పటికే చంద్రబాబును చెడుగుడు ఆడేసిన వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ఇప్పుడు తాజాగా ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సినిమాతో ఆయన నెత్తిన బాంబు వేసేందుకు రెడీ అయ్యారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను ఏపీలో విడుదల కాకుండా నాటి సీఎం చంద్రబాబు అడ్డుకొని వర్మను కెలికాడన్నది అందరికీ తెలిసిందే. వర్మ లాంటి మనిషినే కెలికితే ఎలా ఉంటుందో ఇప్పుడు చంద్రబాబు అర్థమవుతోంది. ఇప్పుడు వర్మ వంతు వచ్చింది. ఏపీలో చంద్రబాబు ప్రత్యర్థి జగన్ అధికారంలో ఉండడంతో వర్మ ఊహలకు పట్టపగ్గాలు లేకుండా చెలరేగిపోతున్నారు.

తాజాగా ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సినిమా ఏపీ రాజకీయాలపైనే వర్మ సంధిస్తున్నారు. ముఖ్యంగా చంద్రబాబు జగన్ మొన్నటి ఎన్నికల వాతావరణాన్నే కథగా మలిచారు. ఇప్పటికే చంద్రబాబు పవన్ కేఏ పాల్ ఫస్ట్ లుక్ లను పాటలను రిలీజ్ చేసిన వర్మ తాజాగా నారా లోకేష్ ఫస్ట్ లుక్ ను కూడా రిలీజ్ చేశారు. అచ్చు గుద్దినట్లు వారికి సరిపోయే నటులను ఎంపిక చేసి వర్మ దించేస్తున్నారు.

తాజాగా వర్మ రిలీజ్ చేసిన పోస్టర్ వైరల్ గా మారింది. నారా లోకేష్ ను పవన్ కళ్యాణ్ ఓదార్చుతున్నట్లుగా ఉన్న ఒక పిక్ ను వర్మ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. ‘రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే’ అని కొటేషన్ ఇచ్చారు. ఈ ఫొటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. టీడీపీ జనసేన వర్గాల్లో చర్చనీయాంశమైంది.

వివాదాలతోనే సినిమాకు బాగా పబ్లిసిటీ తెచ్చుకుంటున్న వర్మ ప్రధానంగా చంద్రబాబు పవన్ నారా లోకేష్ ను టార్గెట్ చేస్తూ పోస్టర్స్ రిలీజ్ చేస్తున్నారు. ఈ కోవలోనే నారాలోకేష్ ఏడుస్తుంటే పవన్ ఓదార్చే ఫొటోను రిలీజ్ చేసి దుమారం రేపారు. రాజకీయ వేడి రగిలిస్తున్న ఈ సినిమా తెలుగు నాట విడుదలైతే ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందనేది ఆసక్తిగా మారింది.
Please Read Disclaimer