వర్మ స్టార్ట్ చేసిన ‘ఏటీటీ’ ఊసే లేదుగా…!

0

క్రియేటివ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఏది చేసినా సంచలమే అని చెప్పాలి. ‘శివ’ సినిమాతో సినీ ఇండస్ట్రీలో పెను మార్పులకు కారణమయ్యాడు వర్మ. అప్పటి వరకూ మూసధోరణిలో వెళ్తున్న సినీ ఇండస్ట్రీకి కొత్త దారి చూపించాడు. డిఫరెంట్ స్క్రీన్ ప్లే తో.. అసాధారణమైన కెమెరా యాంగిల్స్ తో.. కొత్త సౌండింగ్ తో చరిత్ర నిలిచిపోయే విధంగా ‘శివ’ సినిమా రూపొందించాడు. అప్పటి నుంచి ప్రతీ సినిమాలో ఏదొక కొత్త విషయంతో ముందుకొస్తున్నాడు వర్మ. సినిమా అట్టర్ ప్లాప్ అయినా కూడా వర్మ వినూత్నమైన ఆలోచన గురించి అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇప్పుడు అందరూ ‘ఓటీటీ’ అంటుంటే ఆర్జీవీ మాత్రం ‘ఏటీటీ’తో ముందుకొచ్చాడు. శ్రేయాస్ మీడియా సంస్ధ ఆన్ లైన్ థియేటర్ పేరిట చేసిన ప్రయోగానికి వర్మ జత కలిసాడు.

ఈ క్రమంలో ఆర్జీవీ వరల్డ్ పేరుతో శ్రేయాస్ ఎంటర్టైన్మెంట్స్ ఏటీటీలో తన సినిమా ‘క్లైమాక్స్’ని విడుదల చేసాడు. ఈ సినిమా రిలీజైన తర్వాత వర్మ కనిపెట్టిన ‘ఏటీటీ’ గురించి అదే ‘ఎనీ టైమ్ థియేటర్’ గురించి ఊసే లేదు. ఏటీటీలో మా సినిమాని 3 లక్షల మందికి పైగా చూసారు అని ఏవో లెక్కలు చెప్పారు. కానీ ఆ తర్వాత మళ్ళీ దాని గురించి ఎవరూ మాట్లాడింది లేదు. ఒకప్పుడు క్రియేటివ్ డైరెక్టర్ అనిపించుకున్న ఆర్జీవీ ఇప్పుడు తన సినిమాల్లో క్రియేటివిటీ తప్ప అన్నీ చూపిస్తున్నారని.. ఈ క్రమంలో వర్మకి వచ్చిన ఈ క్రియేటివ్ థాట్ పెద్దగా సక్సెస్ అవ్వలేదని ఇండస్ట్రీ వర్గాల్లో అనుకుంటున్నారు. శ్రేయస్ మీడియా వారు ఇప్పుడప్పుడే ఈవెంట్స్ చేసే అవకాశం లేకపోవడంతో వర్మతో కలిసి చేసిన ఏటీటీ (ఎనీ టైమ్ థియేటర్) ప్లాన్ చేశారని.. కానీ వారి ప్లాన్ బెడిసి కొట్టిందని ఇన్సైడ్ టాక్ వినిపిస్తోంది.

అయితే రామ్ గోపాల్ వర్మ ఇకపై తాను తీయబోయే సినిమాలన్నీ ఆర్జీవీ వరల్డ్ – శ్రేయాస్ ఎంటర్టైన్మెంట్ ఏటీటీ లో రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించాడు. ఈ నేపథ్యంలో ‘నగ్నం’ అనే సినిమాని జూన్ 27న రిలీజ్ చేస్తున్నారు. దీంతో పాటు మరో మూడు సినిమాలు అనౌన్స్ చేసారు వర్మ. మరి ఈ సినిమాలతో మళ్ళీ అందరూ ఏటీటీ గురించి మాట్లాడుకుంటారేమో చూడాలి. అయితే ఈ ఏటీటీలో ‘పే ఫర్ వ్యూ’ పద్ధతిలో టికెట్ రేట్ పెడుతుండటంతో అందరూ నిమిషాల్లో పైరసీ సైట్స్ లో డౌన్లోడ్ చేసుకొని చూడొచ్చులే అనుకుంటున్నారు. అంతేకాకుండా ఓటీటీలో ఐతే ఒక్కసారి సబ్స్క్రిప్షన్ తీసుకుంటే ఏడాది మొత్తం అన్ని సినిమాలు చూసేయొచ్చు. కానీ ఏటీటీలో ప్రతి సినిమాకి డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. మరి విన్నూత్న ప్రయత్నం అంటూ వర్మ తెచ్చిన టెక్నాలజీ రాబోయే రోజుల్లో ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేయబోతుందో చూడాలి.
Please Read Disclaimer