వర్మ 12 ‘O’ CLOCK ట్రైలర్ టాక్

0

సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ వరుస సినిమాలను అనౌన్స్ చేస్తూ సినీ అభిమానుల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాడు. ఇప్పటికే అర డజను చిత్రాలను ప్రకటించిన వర్మ తాజాగా ”12 O క్లాక్” అనే హారర్ మూవీ ప్రకటించాడు. ఒకప్పుడు ‘రాత్’ ‘భూత్’ ‘డర్నా మనా హై’ ‘డర్నా జరూరి హై’ ‘వాస్తుశాస్త్ర’ ‘బూత్ రిటర్న్స్’ వంటి సినిమాలతో ఆడియన్స్ ని భయపెట్టిన వర్మ ఈ మధ్య హారర్ సినిమాలు తీయడం తగ్గించేసాడు. ఇప్పుడు అందరూ కరోనా భయంతో వణికిపోతుంటే నేను హారర్ సినిమాతో భయపెడతాను అంటూ 12 ‘O’ క్లాక్ ముందుకొచ్చాడు. ఈ సినిమా వర్మ ఎప్పుడు స్టార్ట్ చేసాడో తెలియదు కానీ సడన్ గా ఈ సినిమా ప్రకటించి ఈ రోజు సాయంత్రం 7 గంటలకి ట్రైలర్ రిలీజ్ చేస్తానంటూ ప్రకటించాడు. చెప్పినట్లుగానే ”మీ లాక్డౌన్ అనుభవాన్ని మరింత భయపెట్టడానికి 12 ‘O’ CLOCK అంటూ ట్రైలర్ విడుదల చేసారు.

1.47 నిముషాలు ఉన్న ఈ హారర్ ట్రైలర్ ఆద్యంతం వర్మ తరహా సీన్స్ తో భయానకంగా సాగింది. ‘ఎక్కడో సైన్స్ మరియు ఆత్మ మధ్య..’ ‘భయం లోతైనది..’ అంటూ మొదలైన ఈ ట్రైలర్ లో ఇంతకముందు ఆర్జీవీ హారర్ సినిమాలలో కనిపించే అమాంతం మనిషి ఎగరడం.. మెడ విరిచేయడం లాంటి సన్నివేశాలు ఇందులోనూ కనిపించాయి. ఇటీవల శృంగారభరితమైన చిత్రాలను తీస్తూ వస్తున్న వర్మ మరోసారి 12 ‘O’ క్లాక్ తో భయపెట్టేలాగే ఉన్నాడని అనిపిస్తోంది. ఇక ఈ హారర్ ట్రైలర్ కి డిఫెరెంట్ సౌండింగ్స్ తో కీరవాణి అందించిన నేపథ్య సంగీతం భయం కలిగించేలా ఉంది. అమోల్ రాథోడ్ సినిమాటోగ్రఫీ కూడా మెచ్చుకునేలా ఉంది.

ఇక ఈ చిత్రంలో మక్రాంద్ దేశ్ పాండే మిథున్ చక్రవర్తి మానవ్ కౌల్ దిలీప్ తహిల్ అలీ అజ్గర్ ఆశిష్ విద్యార్ధి మరియు కృష్ణ గౌతమ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రానున్న ఈ 12 ‘ఓ’ క్లాక్ సినిమాని ఏ కంపెనీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మించారు. ఆర్జీవీ నుండి వచ్చిన ఈ హారర్ ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. ‘క్షణం క్షణం’ సినిమా తర్వాత కీరవాణి రామ్ గోపాల్ వర్మ ఫుల్ లెన్త్ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. ఇంతకుముందు ‘జీఎస్టీ’ అనే ఫిలిం వచ్చినప్పటికీ అది పూర్తి స్థాయి సినిమా కాదు. త్వరలోనే విడుదల కానున్న 12 ‘O’ క్లాక్ సినిమాతో రామ్ గోపాల్ వర్మ మళ్ళీ ఫార్మ్ లోకి వస్తాడేమో చూడాలి.