కేసు బదిలీ చేయాలని సుప్రీంకోర్టుకెళ్లిన సుశాంత్ గర్ల్ ఫ్రెండ్…!

0

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సుశాంత్ కేసుని సీబీఐకి అప్పగించాలనే వాదనలు వినిపిస్తున్న సమయంలో సుశాంత్ తండ్రి కేకే సింగ్ అతని గర్ల్ ఫ్రెండ్ హీరోయిన్ రియా చక్రవర్తితో పాటు ఆమె కుటుంబ సభ్యులపై పాట్నాలోని రాజీవ్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసారు. దీంతో పోలీసులు రియా మరియు ఆరుగురు కుటుంబ సభ్యులపై సెక్షన్ 341 (తప్పుడు సంయమనానికి శిక్ష) 342 (తప్పుగా నిర్బంధించినందుకు శిక్ష) 380 (నివాస గృహంలో దొంగతనం).. 406 (నమ్మకాన్ని ఉల్లంఘించినందుకు శిక్ష) 420 (మోసం మరియు నిజాయితీ లేనివి) సహా వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. రియాతో పాటు ఆమె తో కలిపి మొత్తం ఆరుగురి మీద కేసు నమోదు చేశారు.

కాగా సుశాంత్ ఆత్మహత్య కేసులో రియా చక్రవర్తి పాత్రపై మొదటి నుండి కూడా సోషల్ మీడియా వేదికగా అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో ఆమెపై నెటిజన్స్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతూ.. ఈ కేసుని సీబీఐకి అప్పగిస్తే అన్ని నిజాలు బయటకి వస్తాయని చెప్తూ వస్తున్నారు. ఈ క్రమంలో సుశాంత్ మరణించిన నెల రోజుల తర్వాత రియా చక్రవర్తి సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టి ‘నేను సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ ని.. సుశాంత్ సూసైడ్ కేసులో నిజానిజాలు తెలుసుకోవాలి అనుకుంటున్నాను.. దీనిపై సీబీఐ దర్యాప్తు చేపట్టండి’ అంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ని కోరింది. అయితే ఇప్పుడు సుశాంత్ ఫ్యామిలీ ఆమెపై కేసు పెట్టడం చర్చనీయాంశం అయింది.

ఈ నేపథ్యంలో రియా చక్రవర్తి కూడా చట్టపరంగా ఈ కేసుని ఎదుర్కోడానికి రెడీ అయిందని సమాచారం. ఇప్పటికే ప్రముఖ లాయర్ ద్వారా ముందస్తు బెయిల్ ట్రై చేస్తున్న రియా.. ఇప్పుడు తనపై పాట్నాలో పెట్టిన కేసుని ముంబై పోలీసులకు బదిలీ చేయాలని కోరుతోందని సమాచారం. ఈ మేరకు ఇప్పటికే రియా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది. సుశాంత్ సూసైడ్ చేసుకుంది ముంబై పరిధిలో అని.. అందుకే ఈ కేసులో బీహార్ పోలీసుల విచారణ సరికాదని రియా పిటిషన్ లో పేర్కొన్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఈ కేసును ముంబై పోలీసులకు ట్రాన్సఫర్ చేయాలన్న రియా పిటిషన్ విషయంలో సుప్రీం కోర్టు ఎలా స్పందిస్తుందో చూడాలి. మరో వైపు సుశాంత్ ఫ్యామిలీ తరపు లాయర్ ఈ కేసుని ముంబై నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని.. అందుకే ఇంతవరకు ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేయలేదని.. సుశాంత్ ఫ్యామిలీపై ఒత్తిడి చేస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారు. మొత్తం మీద ఇప్పుడు సూసైడ్ కోసం రియా చుట్టూ తిరుగుతోందని అర్థం అవుతోంది.