తళా vs దళపతి.. ఫ్యాన్స్ పిచ్చి పీక్స్!

0

ఇద్దరు హీరోల ఫ్యాన్స్ వార్ పీక్స్ కి చేరుకుంటే ఎలా ఉంటుందో అజిత్ – విజయ్ ఫ్యాన్స్ ని చూస్తే అర్థమవుతుంది. హద్దు మీరి దారుణమైన వ్యాఖ్యలతో ప్రత్యర్థి హీరోపై ట్రోల్స్ చేయడం ప్రముఖంగా చర్చకు వచ్చింది. ఆ ఇద్దరు హీరోల ఫ్యాన్స్ సోషల్ మీడియా వార్ ఇప్పటిది కాదు.. చాలా కాలంగా నడుస్తున్నదే. తాజాగా అది కాస్తా తీవ్ర రూపం దాల్చడంతో ప్రముఖులు రంగంలోకి దిగి ఈ యుద్ధాన్ని ఆపేందుకు ప్రయత్నిస్తున్నారు. సదరు హీరోలు నేరుగా రంగంలోకి దిగి ఈ సమస్యను పరిష్కరించకపోతే ఇది ఇంకా ముదిరిపోతుందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇంతకీ ఫ్యాన్స్ ఏం చేశారు? అంటే.. కొంతకాలంగా దళపతి విజయ్.. తళా అజిత్ ఫ్యాన్స్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. అప్పట్లో సోషల్ మీడియాలో చోటుచేసుకొన్న ఓ చిన్న సంఘటనతో అజిత్ ఫ్యాన్స్ రెచ్చిపోయారు. `రెస్ట్ ఇన్ పీస్ విజయ్!` అనే వ్యాఖ్యకు హ్యాష్ ట్యాగ్ ని జోడించి అజిత్ అభిమానులు సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. అయితే ఇలా హ్యాష్ ట్యాగ్ తో ఫ్యాన్స్ చేస్తున్న దాడిపై తమిళనాడుకు చెందిన ప్రముఖ క్రికెటర్ అశ్విన్ రవిచంద్రన్ తీవ్రంగా స్పందించారు. యువతరం పెంకి పనులపై తీవ్ర అసంతృప్తిని వెళ్లగక్కారు. ఎన్నో సమస్యలు తమిళ ప్రజలను వెంటాడుతుంటే ఫ్యాన్స్ పిచ్చి వేషాలేంటి? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

“భూగ్రహాన్ని కొద్ది రోజుల క్రితం ఓ గ్రహ శకలం ఢీకొట్టింది. రుతుపవనాలు రాక ఎన్నో నగరాలు నీటి కొరతతో అల్లాడుతున్నాయి. దేశంలో పలు ప్రాంతంలో కరువు తాండవిస్తోంది. హింసాత్మక సంఘటనలతో క్రిమినల్ రెచ్చిపోతున్నారు. ఇవన్నీ పట్టకుండా హీరోల పేరుతో గొడవలా?“ అంటూ అశ్విన్ తిట్టి పోశారు. ఫ్యాన్స్ గొడవల్ని సరిదిద్దాలని విజయ్.. అజిత్ లకు సూచించారు. మౌనం సరికాదని హీరోలను హెచ్చరించారు మరికొందరు. ఇక విజయ్ ప్రస్తుతం `బిగిల్` అనే చిత్రంలో నటిస్తుండగా.. అజిత్ `పింక్` రీమేక్ `నెర్కొండ పార్వాయి` లో నటిస్తున్న సంగతి తెలిసిందే. బిగిల్ దీపావళికి రిలీజ్ అవుతుంటే ఈ ఆగస్టు 8న అజిత్ సినిమా రిలీజవుతోంది. ఈ రెండు సినిమాల రిలీజ్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆత్రంగా వేచి చూస్తున్నారు. పనిలో పనిగా ఒకరిపై ఒకరు ఇలా దుమ్మెత్తి పోస్తున్నారు. దీనిపై ఆందోళన వ్యక్తం అవుతోంది.
Please Read Disclaimer