ఎలిమినేషన్ క్లారిటీ.. ఈ వారం బయటకొచ్చేదెవరంటే?

0

మిగిలిన రెండు సీజన్లకు భిన్నంగా సాగుతోంది బిగ్ బాస్ సీజన్ 3. సీజన్ మొదలైన నాలుగో వారంలో ఎవరు ఎలిమినేట్ అవుతారన్న విషయంపై స్పష్టత వచ్చినట్లేనని చెప్పాలి. ఈ సాయంత్రం టెలికాస్ట్ అయ్యే షోలో హౌస్ నుంచి బయటకొచ్చే కంటెస్టెంట్ ఎవరన్న దానిపై ఫుల్ క్లారిటీ వచ్చేసింది. తొలివారం హేమ.. రెండో వారం జాఫర్.. మూడో వారంలో తమన్నా.. ఎలిమినేట్ కాగా.. ఈసారి ఎలిమినేట్ అయ్యేదెవరు? అందుకు కారణం ఏమిటి? అన్నది చూస్తే..

ఈ వారం ఎలిమినేట్ జోన్ లో ఉన్న కంటెస్టెంట్స్ ఏడుగురు. అందులో రవి.. శివజ్యోతి.. వరుణ్ సందేశ్.. బాబా భాస్కర్.. రాహుల్ సిప్లిగంజ్.. రోహిణి.. శ్రీముఖిలు ఉన్నారు. వీరిలో శివజ్యోతి.. వరుణ్ సందేశ్ లను సేఫ్ గా ఉన్నట్లుగా చెప్పిన నాగ్ కారణంగా ఇప్పుడు ఎలిమినేషన్ లో ఐదుగురు మిగిలారు. వారిలో ఈ వారం ఇంటి నుంచి సూట్ కేస్ పట్టుకొని బయటకు వచ్చేదెవరు? అన్నది క్వశ్చన్ గా మారింది.

ఈసారి టైటిల్ మీద కన్నేసి.. చెలరేగిపోతున్న యాంకర్ శ్రీముఖిలో ఉన్న మరో ఆర్ట్ ను ప్రేక్షకులు గుర్తించేశారు. హౌస్ మేట్స్ తో ఆమె జరిపే అంతరంగిక సమావేశాల్లో వారాంతంలో ఎలిమినేట్ అయ్యేదెవరంటూ ఆమె చేసే విశ్లేషణలు అచ్చుగుద్దినట్లుగా ఉండటం ఆసక్తికరంగా మారింది. ఆమె చెప్పినట్లే మూడు వారాల రిజల్ట్ ఉండటంతో ఈవారం ఆమె ఎవరు హౌస్ నుంచి ఎలిమినేట్ అవుతారన్న విషయాన్ని చూస్తే.. బిగ్ బాస్ హౌస్ వర్గాల నుంచి వస్తున్న సమాచారం.. శ్రీముఖి అంచనా ఒకేలా ఉండటం విశేషం.

ఎలిమినేషన్ లో ఉన్న ఐదుగురిలో సూపర్ సేఫ్ గా ఉన్న కంటెస్టెంట్ ఎవరన్న విషయానికి వస్తే.. తొలిపేరు శ్రీముఖే అవుతుంది. హౌస్ లోకి అడుగు పెట్టిన తొలివారం నుంచి ఎలిమినేషన్ లో ఉన్నప్పటికీ టెన్షన్ లేకుండా ఆడేయటం.. టైటిల్ తనదేనన్న ధీమాను వ్యక్తం చేయటం కనిపిస్తుంది. హౌస్ లోకి రాక ముందు ఆమెకు లభించిన హామీ ఏమిటో తెలీదు కానీ.. ఎలిమినేషన్ లో ఉండి కూడా.. ఈ వారం ఎలిమినేషన్ అయ్యేదెవరంటూ ఆమె విశ్లేషణలు చేయటం కనిపిస్తుంది. తాజాగా ఆమె విశ్లేషణ ప్రకారం రోహిణి హౌస్ నుంచి నిష్క్రమించే అవకాశం ఉందని అంచనా వేసింది. నిజమే.. శ్రీముఖి అంచనా నిజమేనన్న మాట బలంగా వినిపిస్తోంది. ఇందుకు కారణం లేకపోలేదు. ఎలిమినేషన్ కత్తి వేలాడుతున్న ఏడుగరిలో ఇద్దరిని సేఫ్ గా నాగ్ ప్రకటించేయటం.. శ్రీముఖి ఇప్పటికిప్పుడు హౌస్ నుంచి వెళ్లే ఛాన్స్ లేకపోవటంతో.. ఎలిమినేషన్ లో ఉన్న వారిలో బాబా భాస్కర్.. రవిలు సేఫ్ గా బయటపడటం ఖాయం.

హౌస్ లో ఎంటర్ టైన్మెంట్ ఇస్తున్న బాబా భాస్కర్ కారణంగా మాంచి ఫన్ జెనరేట్ అవుతోంది. అందరితో సరదాగా ఉంటూ.. అప్పుడప్పుడు ఆట పట్టిస్తూ వినోదాన్ని అందిస్తున్న బాబా భాస్కర్ బయటకు వచ్చే ఛాన్స్ లేదు. తమన్నా ఎపిసోడ్ తో రవి మీద పొంగిపొర్లుతున్న సానుభూతి ఇప్పట్లో అతగాడిని హౌస్ నుంచి బయటకు రాకుండా కాపాడుతుందని చెప్పాలి. దీనికి తోడు ఇంట్లో అందరితో కలిసిపోవటం.. వివాదరహితుడిగా పేరు తెచ్చుకోవటంతో అతడూ సేఫ్ అయినట్లే.

ఇక.. మిగిలిన ఇద్దరి (రాహుల్.. రోహిణి)లో రాహుల్ బయట పడిపోవటం కాయం. పులిహోర రాజా అనే ట్యాగ్ తో అతను సేవ్ కావటం ఖాయం. దీనికి తోడు పునర్నవితో లవ్ ట్రాక్ మొదలైన వేళ.. దాన్ని కట్ చేసి అతడ్ని బయటకు పంపే అవకాశం ఉండదు. ఇదే రాహుల్ ను బయటకు వెళ్లకుండా అడ్డుకుందని చెప్పొచ్చు. ఒక రకంగా పునర్నవి పుణ్యమా అని రాహుల్ ఈ వారం బతికిపోయారని చెప్పక తప్పదు. ఇక.. ఎలిమినేషన్ లో మిగిలింది రోహిణి మాత్రమే. ఆమె ఆట బాగానే ఆడుతున్నా.. ప్రేక్షకుల మనసుల్ని దోచుకునే విషయంలో వెనుకబడిన కారణంగా ఈ వారం ఆమె ఇంటి నుంచి బయటకు రావటం ఖాయమన్న మాట బలంగా వినిపిస్తోంది. ఎప్పుడు.. ఏమైనా చేసే బిగ్ బాస్ అలాంటి తీరునే ప్రదర్శిస్తే తప్పించి.. రోహిణి ఇంటి నుంచి బయటకు రావటం పక్కా అంటున్నారు.
Please Read Disclaimer