డబ్బులిస్తేనే అవార్డులొస్తాయన్న స్టార్ డైరెక్టర్

0

అవార్డు కార్యక్రమాలు ఫిక్సింగ్ ఈవెంట్లు అన్న విమర్శలున్నాయి. ముందే డబ్బులిచ్చి స్టార్లను ఈ వేడుకలకు రప్పిస్తారని.. అలాగే అవార్డు వచ్చింది అంటేనే స్టార్లు ఈ తరహా ఈవెంట్లకు వస్తారని ఇంతకుముందే జనాలకు బాగా తెలిసిపోయింది. ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు అవార్డు వేడుకలు ప్రహసనంగా మారాయి. ప్రతి ఒక్కరూ అవార్డుల పేరుతో నానా రచ్చ చేస్తున్నారు. అందువల్ల ఏ అవార్డులకు వెళ్లాలో స్టార్లకు అర్థం కాని పరిస్థితి ఉంది. టాలీవుడ్ అయినా బాలీవుడ్ అయినా ఇదే పరిస్థితి.

ఇక ఈ అవార్డుల గురించి ప్రఖ్యాత బాలీవుడ్ దర్శకుడు.. కమర్షియల్ బ్లాక్ బస్టర్ల రారాజు అయిన రోహిత్ శెట్టి ఊహించని కామెంట్ చేయడం అగ్గి రాజేస్తోంది. డబ్బులిస్తేనే ఎవరైనా అవార్డుల కార్యక్రమానికి హాజరవుతాను. నాకు డబ్బు ఇస్తేనే నేను కూడా వెళ్తాను. అవును నిజాయితీగా చెబుతున్నా. వారు నాకు గిట్టుబాటయ్యేలా చెల్లిస్తేనో లేదా నాకు అవార్డు ఇస్తేనో నేను వెళ్తాను. లేకపోతే వెళ్లను“ అని అవార్డు వేడుకలపై సెటైర్లు వేశాడు. ప్రఖ్యాత నేహా ధూపియా చాట్ షోలో రోహిత్ శెట్టి ఈ వ్యాఖ్యలు చేశారు.

అలాగే కమర్షియల్ ఎంటర్ టైనర్ల విషయంలో అవార్డుల కమిటీలు ఉదాసీనంగా వ్యవహరిస్తాయని రోహిత్ విమర్శించాడు. “వాస్తవానికి కమర్షియల్ సినిమాలు చేయడమే కష్టం. మేము కూడా ఒక సినిమా కోసం రోజుకు 18 గంటలు కష్టపడి పనిచేస్తాం. ఒక యాక్షన్ సన్నివేశాన్ని 48 ° C లో చిత్రీకరించడం.. ఒక సాధారణ సినిమా తీయడం కంటే చాలా కష్టం. కానీ కమిటీ వాళ్లు వాణిజ్య చిత్రాలను పరిగణించరు. అందుకే చెబుతున్నా. మీరు నాకు అవార్డు ఇవ్వాలనుకుంటేనే నేను వస్తున్నాను. లేదా అతిధిగా రావడానికి మీరు నాకు డబ్బు చెల్లిస్తేనే వస్తాను“ అంటూ సుత్తి లేకుండా సూటిగానే మాట్లాడాడు.

రోహిత్ శెట్టి ప్రస్తుతం కాప్ మూవీ `సూర్యవంశీ`తో బిజీగా ఉన్నారు. ఇందులో అక్షయ్ కుమార్ – కత్రినా కైఫ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అజయ్ దేవ్ గన్ .. రణ్వీర్ సింగ్ కూడా ఈ చిత్రంలో ఐకానిక్ క్యారెక్టర్లు బాజీరావ్ సింఘం.. సంగ్రామ్ భలేరావ్ (సింబా) పాత్రలతో కామియోలో కనిపించనున్నారు. రోహిత్ శెట్టి పిక్చర్స్- ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం మార్చి 27న విడుదల కానుంది.
Please Read Disclaimer